
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి.
నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది.
వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు.
ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం.
అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం.
దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు.
దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.
సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది.