
పెట్టుబడి సాయానికి ఎగనామం
సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వంలో వ్యవసాయా నికి పెద్దపీట వేస్తామన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. సాగు పెట్టుబడుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామన్నారు. పాలన చేపట్టడమే ఆలస్యం.. ఏటా రూ.20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామంటూ కూటమి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఊదరగొట్టారు. కూటమి పాలన చేపట్టి అప్పుడే 11 నెలలు కావస్తోంది. 2024–25 సీజన్‌కు పీఎం కిసాన్ సాయాన్ని కేంద్రం ఎప్పుడో రైతుల ఖాతాలకు జమ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం ‘అన్నదాత సుఖీభవ’ అమలు ఊసేత్తడం లేదు. ఈ సీజన్‌లో రూ.20 వేల చొప్పున అందాల్సిన సాయాన్ని నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని 2.10 లక్షల ఎకరాల్లో ఖరీఫ్, 2.3 లక్షల ఎకరాల్లో రబీ సాగవుతున్నాయి. 2024–25 వ్యవసాయ సీజన్‌లో రైతులకు కలిసి రాలేదు. భారీ వర్షాలు, వరదల రూపంలో సాగు ప్రారంభంలోనే 38 వేల ఎకరాల్లోని పంట దెబ్బతిని రెండోసారి నాట్లు వేయాల్సి వచ్చింది. చివర్లో ఫెంగల్ తుఫాన్ కంటి మీద కునుకు లేకుండా చేసింది. తేమ శాతం పేరిట దళారులు, మిల్లర్లు బస్తాకు రూ.300 వరకు కోతపెట్టి రైతుల కష్టాన్ని దోచుకున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా 30 బస్తాల లోపే వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు డబ్బుల్లేక రబీ సాగు ఆలస్యమైంది. ఎరువుల ధరలు బస్తాకు రూ. 50 నుంచి రూ. 230 వరకు పెరగడంతో ఎకరాకు రూ. 500 వరకు అదనపు భారం పడింది. ప్రతికూల వాతావరణంతో పంటకు తెగుళ్ల బెడద ఎక్కువై సాగు పెట్టుబడులు పెరిగిపోయాయి.
సీజన్ ముగుస్తున్నా.. సుఖీభవ సాయం లేదు
ప్రస్తుతం జిల్లా అంతటా రబీ మాసూళ్లు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ రైతులు కోతలు, ధాన్యం ఆరబెట్టుకోవడం, పట్టుబడుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు వారాల్లో రబీ తుది దశ పనులు పూర్తి కానుండగా అన్నదాత సుఖీభవ సాయం విడుదలపై పాలకులు నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వం చేసిన దగాతో ఈ ఏడాది ఒక్కో రైతు రూ. 20 వేలు చొప్పున జిల్లాలోని దాదాపు 1,17,999 రైతులు రూ.235.99 కోట్లు నష్టపోతున్నట్టు అంచనా.
పంటల బీమాకు ఎసరు
అన్నదాత సుఖీభవ సాయం అందించకపోగా ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ఎసరుపెట్టింది. ఎకరాకు రూ.615 చొప్పున రబీ నుంచి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలోని 2.3 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరగగా.. ప్రీమియం రూపంలో జిల్లా రైతులపై రూ.14.15 కోట్ల భారం పడింది. గత ఐదేళ్లలో దాదాపు రూ.140 కోట్ల ప్రీమియం సొమ్మును రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించడం గమనార్హం.
అన్నదాత సుఖీభవ ఊసెత్తని కూటమి
ఈ సీజన్‌లో రూ.235.99 కోట్ల సాయాన్ని నష్టపోయిన రైతులు
ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో రైతుపై రూ.14 కోట్ల భారం
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు రూ.796.49 కోట్ల సాయం
గత ప్రభుత్వంలో అందించిన రైతు భరోసా సాయం
సంవత్సరం రైతులు ప్రభుత్వం సాయం
(రూ.కోట్లలో)
2019–20 1,09,302 147.56
2020–21 1,24,664 168.3
2021–22 1,17,791 159.02
2022–23 1,13,597 153.36
2023–24 1,24,645 168.17
గతంలో సాగుకు ముందే సాయం
వైఎస్సార్ రైతు భరోసాగా గత ప్రభుత్వంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించేవారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సాయం రూ.6000కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 జతచేసి ఏటా రూ. 13,500 మొత్తాన్ని ఖరీఫ్ ప్రారంభం, కోతలు, రబీ ప్రారంభంలో మూడు విడతలుగా అందించేవారు. తొలి విడతగా మే నెలలో రూ.7500, ఖరీఫ్ చివరిలో రెండో విడతగా రూ.4000, రబీ ప్రారంభ సమయంలో మూడో విడతగా రూ.2,000 సాయం అందించేవారు. గత ఐదేళ్లలో 1,17,999 మంది రైతులకు రూ.796.49 కోట్లు సాయం అందించారు.