
కలగానే ఫిషింగ్ హార్బర్
● కూటమి సర్కారు రాకతో అటకెక్కిన పనులు
● రూ.429.43 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్
● గత 9 నెలల్లో ఒక్క అడుగూ ముందుకు పడని వైనం
నరసాపురం: నరసాపురంలో దశాబ్దాల కలగా ఉన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కలగానే మిగిలిపోనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు మంజూరు చేసిన ఈ భారీ ప్రాజెక్టు గత 9 నెలలుగా పడకేసింది. ఎన్నికలకు ముందు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి, పనులు ప్రారంభమవుతాయనుకున్న సమయంలో.. నేడు హార్బర్ నిర్మాణం ఇక లేనట్టే అన్న చందంగా మారిపోయింది. గోదావరి జిల్లాలకు మణిహారంగా నరసాపురంలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో ఈ హార్బర్ నిర్మాణానికి 2022 మే నెలలో ఏపీ మారిటైం బోర్డు టెండర్లు పిలవగా, విశ్వసముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులతో పాటు ఇతర సాంకేతిక అనుమతులు వచ్చాయి. టెండర్లు పిలవడంతో విశ్వ సముద్ర సంస్థ పనులు దక్కించుకుంది. రూ.429.43 కోట్లతో నిర్మించే హార్బర్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు 2023, ఫిబ్రవరిలో ప్రారంభించారు.
మత్స్య ఎగుమతులు పెంచే లక్ష్యంతో..
తీరప్రాంతంలో సముద్ర మత్స్య సంపదతో భారీగా ఆదాయం సమకూరుతుంది. ఏటా నరసాపురం తీరంలో రూ.300 కోట్ల విలువచేసే మత్స్య ఎగుమతులు సాగుతాయి. కానీ హార్బర్ లాంటి మౌలిక వసతులు ఉంటే మరో 40 శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హార్బర్ నిర్మాణానికి పూనుకుంది. బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్‌ను 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల భారీ వ్యయంతో నిర్మించతలపెట్టి పనులు మొదలుపెట్టారు. అయితే కూటమి సర్కార్ ప్రాజెక్ట్‌ను పూర్తిగా అటకెక్కించింది.
హార్బర్ నిర్మాణం పూర్తి చేయించాలి
బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని దశాబ్దాలుగా మత్స్యకా రులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చేశారు. టెండర్లు పిలిచి, పనులు విశ్వసముద్ర సంస్థకు అప్పగించాం. పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యాయి. నిర్మాణం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి.
ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కూటమి సర్కారు రాకతో సీన్ రివర్స్
కూటమి సర్కారు వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం, ప్రాథమికంగా పనులు ప్రారంభం కావడం జరిగింది. కూటమి సర్కారు గద్దెనెక్కిన తరువాత పనులు చేపట్టడంలో విశ్వసముద్ర సంస్థ వెనకడుగు వేసినట్టు సమాచారం. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఓ ప్రకటన కూడా చేయలేదు. దీంతో అసలు హార్బర్ సాకారమవుతుందా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. 19 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.

కలగానే ఫిషింగ్ హార్బర్