
గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్లు తమ వాహనాల నెంబర్ల కోసం ఎంతటి ఖర్చుకైనా సై అంటున్నారు. ఇటీవలె ఓ ప్రముఖ టాలీవుడ్ నటుడు తన వాహనం కోసం ఓ ఫ్యాన్సీ నెంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు. ఆయన ఈ నెంబర్ కోసం ఏకంగా రూ.7లక్షలకు పైగా వెచ్చించడం విశేషం. ఆయనొక్కరే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. అయితే స్టార్ల ఆరాటం వెనుక అనేక రకాల సెంటిమెంట్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల నగరానికి చెందిన కార్పొరేట్ కంపెనీలు సైతం నెంబర్ల వేటలో స్టార్లతో పోటీపడుతుండడం కనిపిస్తోంది.
మహేష్ నుంచి మాస్ మహారాజ్ దాకా..
సూపర్ స్టార్ మహేష్‌బాబు సైతం నెంబర్ల వేటకు నేను సైతం అంటున్నారట. ఆయన తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడీజ్ జీఎల్‌ఎస్‌ల కోసం టీఎస్ 09 ఇకె 600, టీఎస్ 09 జీఒ 600 లను కొనుగోలు చేశారట. నాగార్జున బీఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఏపీ 09 బీడబ్ల్యూ 9000ను వేలంలో దక్కించుకున్నారని సమాచారం. నెంబర్‌ను ఆయన పవర్‌ఫుల్ నెంబర్‌గా పరిగణిస్తారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నెంబర్లపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. ఆయన తన రేంజ్‌రోవర్, వోల్వో ఎక్స్‌సీ 90 నెంబర్ టీఎస్07 జీఇ 9999 రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారని సమాచారం. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బీవైడీ అట్టో 3 నెంబరు టీఎస్ 09 జీబీ 2628 కోసం రూ.17,628 వెచి్చంచారని సమాచారం.
కార్పొరేట్ కంపెనీలు సైతం..
హీరో బాలకృష్ణ తర్వాత ‘0009’నెంబర్‌ను నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కొనుగోలు చేయడం విశేషం. కంపెనీలు సైతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు పోటీ పడుతున్నాయనడానికి ఇదో నిదర్శనం. వ్యాపార ప్రతిష్ఠను పెంచడంలో, బ్రాండ్ గుర్తింపును పెంచడంలో వాహనాల నెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టీఓ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ‘టీజీ 09 9999’ నంబర్‌ను సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ సంస్థ రూ.25.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ నంబర్‌ను టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనానికి కేటాయించారట. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) ‘టీజీ 09 డీ 0009’ నంబర్‌ను రూ.10.4 లక్షలకు సొంతం చేసుకుంది. ‘టీజీ 09 సీ 9999’ నంబర్‌ను రూ.7.19 లక్షలకు శ్రియాన్ కన్‌స్ట్రక్షన్స్ కొనుగోలు చేసిందట. అదే విధంగా పోరస్ అగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ’ టీజీ 09 డీ 0006’ నంబర్‌ను రూ.3.65 లక్షలకు దక్కించుకుందని, వేగశ్రి గోల్డ్ అండ్ డైమండ్స్ ‘టీజీ 09 డీ 0005’ నంబర్‌ను రూ.3.45 లక్షలకు కొనుగోలు చేసిందని సమాచారం.
జూనియర్ ఎన్‌టీఆర్ సైతం..
సినీ హీరో నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్‌ను దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అదే విధంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్‌టీఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారట.
ఆయన రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లాంబోర్గినీ ఉరూస్ వాహనం నెంబర్ కోసం భారీగానే వెచ్చించారని విస్వసీయ వర్గాల సమాచారం. టీఎస్ 09 ఎఫ్‌ఎస్ 9999 కోసం ఏకంగా రూ.17లక్షలు వ్యయం చేశారు. ఎనీ్టయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్‌నే ఎంచుకుంటారట.
సెంటిమెంట్స్‌తో ఆర్టీఏకి కాసుల పంట..
రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లను పొందడం ద్వారా తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని చూడడం ఈ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. అలాగే 6, 9 తదితర నంబర్లను సెంటిమెంట్‌గా లక్కీ నెంబర్లుగా భావించడం కూడా మరో కారణం. కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రత్యేకంగా చూపించేందుకు ప్రత్యేక నంబర్లను ఉపయోగిస్తున్నాయి.
ఏదైతనేం.. సదరు సెంటిమెంట్లు, క్రేజ్ మూలంగా గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని ఐదు ఆర్టీఓ కార్యాలయాలు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.124.20 కోట్లు ఆదాయాన్ని గడించాయి. పోటీ పెరుగుతుండడంతో వీటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇది గత ఏడాది ఆదాయం రూ.118 కోట్లతో పోలిస్తే సుమారు 5% పెరుగుదల నమోదైందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.