
ఫ్యాన్సీ నంబర్.. స్టేటస్ సింబల్..
వాహనదారుల్లో తీవ్ర పోటీ
ఆర్టీఏకు కనకవర్షం
‘టీఎస్ 09 ఈఎల్ 9999’ ఆర్టీఏ నిర్ణయించిన ఫీజు రూ.50 వేలు. వేలంలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన మొత్తం రూ.10.50 లక్షలు. ‘టీఎస్07 ఈఎక్స్ 9999’ నంబర్‌కు గచ్చిబౌలికి చెందిన ఓ ఖరీదైన వాహన యజమాని చెల్లించిన మొత్తం రూ.5.77 లక్షలు. గురువారం మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో ‘టీఎఫ్ 11 ఈఎఫ్ 9999’ నంబర్ కోసం ఓ కాంట్రాక్టర్ చెల్లించింది రూ.4.80 లక్షలు. కారు ఉంటే హోదా రాదు.. ఎంత ఖరీదైన కారు కొన్నావన్నది కాదు.. దానికి ఫ్యాన్సీ నంబర్ ఉందా.. లేదా..! అన్నదే ముఖ్యం.
అందుకే ‘9,1,999,9999, 786,6, 666,1111’ వంటి నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్సీ నంబర్ క్రేజ్ ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. తమకు నచ్చిన నంబర్ల కోసం వాహనదారులు లక్షలు వెచ్చించేందుకు వెనుకాడ్డం లేదు. ఇదే ఆర్టీఏకు కనకవర్షం కురిపిస్తోంది.
సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం అనూహ్యమైన పోటీ నెలకొంటోంది. వాహనదారులు పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు. బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బెక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. నచ్చిన నంబర్లకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించిన వేలం పాటల్లో ఇలాంటి నంబర్లపై రూ.20.25 కోట్ల ఆదాయం లభించింది. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’తో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే రూ.15 కోట్లకు పైగా ఆదాయం లభించడం విశేషం.
హోదా కోసమే ఎక్కువ..
అదృష్ట సంఖ్యలుగా భావించే నంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే సామాజిక హోదా కోసం, పేరు కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు వంటి భిన్న రంగాలకు చెందినవారు ‘లక్కీ’ నంబర్ల కోసం ఎగబడుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల కోసం వేలాది మంది పోటీపడుతున్నారు. నచ్చిన నంబర్ లభించనివారు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు.
సెంటిమెంట్‌తో మరికొందరు..
కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నంబర్లతో అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రే జీకి కారణమే. జ్యోతిషం ప్రకారం తమ స్వభావానికి తగిన నంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంత స్వభావానాకి, గురుగ్రహ ప్రభావం కోసం ‘3’, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఇలా 1 నుంచి 9 వరకు నమ్మకాలున్నాయి. ఇక ఎక్కువ మంది కోరుకునే ‘9’ కుజ గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో తిరుగులేని నాయకులుగా ఎదగాలంటే ఈ నెంబ ర్ ఉండాలని భావిస్తారు.
ఈ క్రేజ్ ఎనిమిదో దశాబ్దం నుంచే..
ప్రస్తుతం ఖరీదైన వాహనాలతో పాటే నగరంలో ఫ్యాన్సీ నంబర్లకు సైతం క్రేజ్ పెరిగింది. కానీ 1980 నుంచే ఈ నంబర్ల పట్ల వాహనదారుల్లో మక్కువ ఉంది. ‘9999’ వంటి నెంబర్లు అప్పట్లో రూ. 500 కే లభించేవి. ఎలాంటి పోటీ ఉండేది కాదు. అప్పట్లో ఎన్టీ రామారావు ‘27’, 999’, ‘9999’ వంటి నంబర్లకు ప్రాధాన్యతనిచ్చేవారు. పైగా ప్రముఖులు నివసించే ప్రాంతం కావడంతో ఖైరతాబాద్‌లో ఈ నెంబర్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది.
ఆదాయం పెరిగింది
గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నంబర్లపై అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్యాలయంలో గతంలో రూ. 2 కోట్ల ఆదాయం ఇప్పుడు రూ.15 కోట్లకు పెరిగింది. లగ్జరీ వాహనాల వినియోగం పెరగడం, ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా ఈ నంబర్ల కోసం గట్టి పోటీ ఉంటోంది. - టి.రఘునాథ్, హైదరాబాద్ జేటీసీ
నంబర్‌ను గిఫ్టుగా ఇస్తున్నారు..
ఇటీవల వినియోగదారులు తమ కుటుంబ సభ్యులకు బహుమానంగా వాహనాలతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ‘1313’ (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘5121’ నంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. ‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లలకు ఎంతో క్రేజీ ఉంది. - జీపీఎన్ ప్రసాద్, ప్రాంతీయ రవాణా అధికారి, ఖైరతాబాద్