
రూ. 6.03 లక్షలు పలికిన 'ఫ్యాన్సీ నెంబర్'
విజయవాడ : ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. కోరుకున్న నంబరును దక్కించుకునేందుకు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు ఏపీ డీహెచ్ 9999 నంబరు కోసం ముగ్గురు పోటీపడ్డారు. వారిలో సూపర్‌విజ్ ప్రొఫెషనల్స్ లిమిటెడ్ యజమాని గుప్తా రిజర్వేషన్ ఫీజు రూ.50వేలు, బిడ్ అమౌంట్ రూ.5,53,000 మొత్తం రూ.6,03,000 అధిక మొత్తం వేయడంతో వారికి కేటాయించారు. ఇది నగరంలోని ఆర్టీఏ చరిత్రలో అత్యధిక ధరగా చెపుతున్నారు. ఇప్పటివరకూ ఇంత ధర చెల్లించి ఎవరూ నంబరును దక్కించుకోలేదని ఆర్టీఏ వర్గాలు చెపుతున్నారు.
రూ.10 లక్షల ఆదాయం
రిజర్వేషన్ ఫీజుల రూపంలో రూ.3,16000, బిడ్ అమౌంట్ రూ.7,57,745 మొత్తం రూ.10,73,745 ఆదాయం వచ్చినట్లు అదనపు రవాణా కమిషనర్ పి.శ్రీనివాస్ చెప్పారు. డీటీసీ కార్యాలయంలో ఏపీ16డీహెచ్ సిరీస్‌తో నంబర్ల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రవాణేతర వాహనాలకు నూతన సిరీస్ ఏపీ16డీహెచ్ 1నుంచి 9999నంబర్ల వరకు కేటాయించినట్లు తెలిపారు. మొత్తం 77మంది రిజర్వేషన్ నంబర్లు కోసం పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి టీడీసీ రాజారత్నం, ఆర్టీవోలు డీఎస్‌ఎన్.మూర్తి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.