
అందుబాటులోకి వచ్చిందని ప్రకటించిన సైన్యం
శ్రీనగర్: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంత మంతటా హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది.
సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్‌లతోపాటు సియాచిన్ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్‌లో 5జీ మొబైల్ టవర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది.
తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు.