
విదేశీ విద్యార్థులు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరిక
రాయితీ రద్దును పరిశీలిస్తామని బెదిరింపులకు దిగిన సర్కార్
న్యూయార్క్/వాషింగ్టన్: తన మాట వినని వాళ్లను ఎలాగైనా దారికి తెచ్చుకునేందుకు తెగించే ట్రంప్ ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాలనూ తన బెదిరింపులతో భయపెడుతున్నారు. అమెరికన్ యువతలో పాలస్తీనా అనుకూల భావజాలం విశ్వవిద్యాలయాల కారణంగానే వ్యాప్తిచెందుతోందని ఆరోపిస్తూ తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీపై ఆంక్షల కత్తిని వేలాడదీశారు. ఇప్పటికే వర్సిటీకి రావాల్సిన 220 కోట్ల డాలర్ల నిధులను నిలిపేసిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈనెల చివరికల్లా వర్సిటీలోని విదేశీ విద్యార్థుల ‘క్రమశిక్షణా’ చర్యల రికార్డులను తమకు అందించాలని హూంకరించారు.
ఈ మేరకు వర్సిటీనుద్దేశిస్తూ అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఈనెల 30వ తేదీలోపు హార్వర్డ్ వర్సిటీలోని విదేశీ విద్యార్థుల చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేయాలి. అలా అందజేయలేదంటే మీ ‘స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్‌ఈవీపీ)’ అర్హతను మీకు మీరుగా వదులు కున్నట్లు భావిస్తాం’’ అని హోమ్ ల్యాండ్ సె క్యూరిటీ శాఖ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ పేరిట ఆ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. విదేశీ విద్యా ర్థులు స్టూడెంట్ వీసా పొందేందుకు కావాల్సిన అర్హతా పత్రాల జారీకి వీలు కల్పించే సర్టిఫికేషన్ విధానాన్నే ఎస్‌ఈవీపీగా పేర్కొంటారు.
‘‘ప్రైవేట్ వర్సిటీగా మీకు ఏకంగా 53.2 బిలియన్ డాలర్ల నిధులు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నిధులు రాకున్నా మీకొచ్చే నష్టమేం లేదు. సొంతంగా నిర్వహణ ఖర్చులను సర్దుకోగలరు. అందుకే ప్రభ్వుత గ్రాంట్లకు కోత పెడుతున్నాం. ప్రభుత్వంతో చక్కటి ఆర్థిక సంబంధాలు కొనసాగించాలంటే మేం అడిగిన వివరాలు సమగ్రస్థాయిలో ఇవ్వండి. అక్రమ, హింస ఘటనల్లో పాల్గొని క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్థుల వివరాలను అందజేయండి’’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో హెచ్చరించింది. 2024–25 విద్యాసంవత్సంలో హార్వర్డ్ వర్సిటీలో 6,793 మంది విదేశీ విద్యార్థులు చేరారు. మొత్తం విద్యార్థుల్లో వీరు 27.2% మంది ఉన్నారు.
వర్సిటీకి పన్ను మినహాయింపు హోదా రద్దు !
వర్సిటీకి ఆర్థిక కష్టాల కడలిలోకి తోసేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందులోభాగంగా వర్సిటీకి ఉన్న ‘పన్ను మినహాయింపు హోదా’ను రద్దుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సంబంధింత వివరాలను తమకు అందజేయాలని ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్) విభాగాన్ని ప్రభుత్వం కోరింది. నియమాలకు అనుగుణంగా వర్సిటీ నిర్వహణ లేదని తప్పుడు కారణాలు చూపి వర్సిటీకున్న పన్ను మినహాయింపు హోదాను రద్దుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వర్సిటీ కోర్టును ఆశ్రయించే వీలుంది.