
ఒట్టావా: కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక సైనీ(Vanshika Saini) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. స్థానికంగా ఓ బీచ్‌లో ఆమె శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని రికవరీ చేసుకున్న స్థానిక పోలీసులు.. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్ ధ్రువీకరిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక. ఆమె రెండున్నరేళ్ల కిందట డిప్లోమా కోర్సు కోసం కెనడా వెళ్లింది. ఏప్రిల్ 25వ తేదీన అద్దె ఇంటిని వెతికేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. ఆమె నుంచి రెండు రోజులు ఫోన్ కాల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులకు కాల్ చేశారు. వాళ్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 28వ తేదీన ఆమె మృతదేహం ఒట్టావా బీచ్ వద్ద లభ్యమైంది.
ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే అంశంతో పాటు ఈ కేసులో స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కెనడాలో భారతీయ విద్యార్థుల మరణాలు పెరిగిపోయాయి. తాజాగా.. గ్యాంగ్ వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో.. బస్టాప్‌లో వేచి చూస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ రంధావా బుల్లెట్ తగిలి అనూహ్యంగా చనిపోయింది. కొన్నాళ్ల కిందట.. రాక్‌లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.