
జెరూసలేం సమీపంలో మంటలు, వేలాది మంది తరలింపు
జెరూసలేం: ఇజ్రాయెల్‌లోని జెరూసలేం సమీపంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 13 మంది గాయపడ్డారు. మంటలను ఆర్పేందుకు అగి్నమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్చిచ్చు ఆందోళనతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రద్దు చేసిన ఇజ్రాయెల్.. మంటలు ఆర్పేందుకు అంతర్జాతీయ సాయం కోరుతోంది.
జెరూసలేం నగర శివార్లలో చెలరేగుతున్న భారీ మంటల కారణంగా అధికారులు కేవలం 24 గంటల్లో వేలాది మంది నివాసితులను ఖాళీ చేయించారు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవ ఇప్పటివరకు 23 మందికి చికిత్స అందించింది. వారిలో 13 మంది కాలిన గాయాలు, పొగ పీల్చడంతో ఆసుపత్రి పాలయ్యారు. జెరూసలేం నుంచి టెల్ అవీవ్ వెళ్లే ప్రధాన మార్గంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల కొండటలపై దట్టమైన పొగలు వ్యాపించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంటల ధాటికి చాలా మంది తమ కార్లను వదిలేసి పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. వందలాది మంది పౌరులు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారని ఏజెన్సీ హెచ్చరించింది. కార్చిచ్చు కొనసాగుతున్న రూట్ 1 సహా పలు రహదారులను మూసివేశారు.
160 రెస్క్యూ, అగి్నమాపక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. అలాగే డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ దేశ సైన్యం కూడా గాలింపు, సహాయక చర్యలకు సహకరిస్తోంది. అయితే పొడి వాతావరణం, అధిక గాలుల కారణంగా మంటలు మరింత తీవ్రమవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ కార్చిచ్చు ఈ దశాబ్దంలోనే అతి పెద్దదని ఇజ్రాయెల్ అగి్నమాపక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లోని జాతీయ ఉద్యానవనాలు, అడవుల వైపు ప్రజలు వెళ్లకుండా నిషేధించారు. ‘‘జెరూసలేం హిల్స్‌లో జరిగిన అగి్నప్రమాదం ఈ దేశంలోనే అతిపెద్దది కావచ్చు.
మా యాక్టివిటీకి సంబంధించి. ఇది చాలా కాలం కొనసాగుతుంది. మేము నియంత్రించడానికి చాలా కష్టపడుతున్నాం.’’అని ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ జెరూసలేం జిల్లా కమాండర్ ష్ములిక్ ఫ్రీడ్మన్ చెప్పారు. గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దళం 18,000 లీటర్ల అగి్నమాపక సామగ్రిని క్యారీ చేయగల సి –130 జె సూపర్ హెర్క్యులస్ భారీ రవాణా విమానాలను ఈ ఆపరేషన్లలో మోహరించింది. ఈ తరహా విమానాలు రెండు మంటలను ఆర్పే ందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 3వేల ఎకరాల అడవి కాలిపోయింది. 2010 ఉత్తర ఇజ్రాయెల్‌లోని మౌంట్ కార్మెల్‌లో కార్చిచ్చు.. 12వేల ఎకరాలను దహనంచేసింది. 44 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రస్తుత కార్చిచ్చు ఆ విపత్తు స్థాయి, ప్రభా వంలో అంతకు మించి ఉండవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు...
కార్చిచ్చు చెలరేగడంతో ఇజ్రాయెల్‌లో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. జెరూసలేంలో జరగాల్సిన ప్రధాన ప్రభుత్వ కార్యక్రమం సహా అన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం రద్దయ్యాయి. అనంతరం ఈ వేడుకను రికార్డు చేసి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రదర్శించారు. కార్చిచ్చు జెరూసలేంను చేరే అవకాశం ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. పశి్చమంగా వీస్తున్న గాలి మంటలను జెరూసలేం శివార్ల వైపు, నగరంలోకి కూడా సులభంగా నెట్టేయగలదని, జెరూసలేంను రక్షించడమే ప్రస్తుత ప్రాధాన్యతని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్చిచ్చును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అంతర్జాతీయ సహాయం కోరింది. ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ స్పందించింది. మంటలను ఆర్పేందుకు విమానాన్ని పంపనున్నట్టు ప్రకటించింది. స్పెయిన్, ఫ్రాన్స్, రొమేనియా, క్రొయేíÙయా, ఇటలీ, ఉత్తర మాసిడోనియా కూడా విమానాలాను పంపుతామని తెలిపాయి.
తోడైన ఇసుక తుఫాను...
కార్చిచ్చుకు భారీ ఇసుక తుఫాను తోడయ్యింది. ఆకాశమంతా ఇసుక మేఘాలు నిండిపోవడంతో అసలేమీ కనిపించడం లేదు. నెగెవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరానికి ఇసుక తుఫాను చేరింది. గాలుల తీవ్రత కారణంగా సైనిక స్థావరం గేట్లను మూసివేయడానికి సైనికులు కష్టపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. పగటి పూట భారీ గాలులు వీస్తాయని, భారీ పొగమంచు ఏర్పడుతుందని, దక్షిణాదిన ఇసుక తుఫానులు కూడా వస్తాయని చెప్పారు. తీరం వెంబడి 98 నుంచి 100 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.