
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.
‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్‌ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!
అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్‌లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్‌లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.
ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్‌ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు.