పోప్‌ అస్తమయం | Pope Francis has died on Easter Monday | Sakshi
Sakshi News home page

పోప్‌ అస్తమయం

Published Tue, Apr 22 2025 4:56 AM | Last Updated on Tue, Apr 22 2025 4:56 AM

Pope Francis has died on Easter Monday

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కన్నుమూత

ఈస్టర్‌ సందర్భంగా చివరిసారి దర్శనం 

శోకసంద్రంలో క్యాథలిక్‌ సమాజం 

ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ 

వాటికన్‌ సిటీ: ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్‌ క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువైన పోప్‌ ఫ్రాన్సిస్‌ ఇక లేరు. 88 ఏళ్ల ఫ్రాన్సిస్‌ అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ‘‘పోప్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారి తీసింది’’ అని వాటికన్‌ వర్గాలు పేర్కొన్నాయి.  ‘‘తన జీవితమంతటినీ చర్చి, ప్రభువు సేవకే అంకితం చేసిన రోమ్‌ బిషప్‌ ఫ్రాన్సిస్‌ ఈ ఉదయం 7.35కు తండ్రి సన్నిధి చేరారు’ అంటూ వాటికన్‌ కార్డినల్‌ కెవిన్‌ ఫారెల్‌ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్‌ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్‌ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్‌ మత పెద్దలు, అధికారుల సందర్శన నిమిత్తం శాంతా మార్తా చాపెల్‌లో ఉంచుతారు.

 అనంతరం సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్‌ పీటర్స్‌ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు తుది నివాళులు అరి్పస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్‌లో సంతాప దినాలు పాటించాక పోప్‌ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్‌ ఇటీవలే 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిమోనియాతో 1950ల్లోనే ఆయన కుడి ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. పోప్‌ చివరిసారిగా ఈస్టర్‌ సందర్భంగా ఆదివారం బయటి ప్రపంచానికి కన్పించారు.

భారతీయులపై పోప్‌ ప్రేమాభిమానాలు మరవలేనివి: మోదీ 
న్యూఢిల్లీ: పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘ప్రేమాభిమానాలకు, సహానుభూతికి మారుపేరుగా ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. యువప్రాయం నుంచే ఫ్రాన్సిస్‌ క్రీస్తు సేవకు అంకితమయ్యారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. బాధల్లో ఉన్న కోట్లాదిమందిలో ఆశాదీపం వెలిగించారు. ఆజన్మాంతం ఫ్రాన్సిస్‌ ప్రదర్శించిన ఆధ్యాతి్మక స్థైర్యం అందరికీ ఆదర్శం. ముఖ్యంగా భారతీయుల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపారు. ఆయనతో భేటీ అయిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను’’ అన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా పలు చర్చిల ప్రతినిధులు తదితరులు పోప్‌ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

సంతాపాల వెల్లువ 
పోప్‌ అస్తమయం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇది తమనెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3, ప్రధాని కియర్‌ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సలా వాండెర్‌ లెయన్, స్పెయిన్‌ ప్రదాని పెడ్రో శాంచెజ్, పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్, డెన్మార్క్‌ ప్రధాని డిక్‌ స్కూఫ్, ఈజిప్ట్‌ అధ్యక్షుడు ఎల్‌ సిసీ, ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్, దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిల్‌ రషీల్‌ అల్‌ మక్తూమ్‌ తదితరులు సంతాప సందేశాలు విడుదల చేశారు. భావి తరాలకు ఫ్రాన్సిస్‌ గొప్ప ఆదర్శంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఈస్టర్‌ సందర్భంగా ఆదివారమే పోప్‌తో భేటీ అవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గుర్తు చేసుకున్నారు.

సంస్కరణవాదిగా చెరగని ముద్ర 
అది 2013. పోప్‌ బెనెడిక్ట్‌–16 తన పదవికి రాజీనామా చేసి రిటైరయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిస్థితుల నడుమ 266వ పోప్‌గా ఫ్రాన్సిస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్‌ అమెరికన్‌గా, తొలి జెస్యూట్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన అసలు పేరు జార్గ్‌ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్‌ 17న అర్జెంటీనాలో రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జని్మంచారు. ఐదుగురు సంతానంలో అందరికంటే పెద్దవాడు. దైవసేవే తన మార్గమని 17 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు. 36 ఏళ్లకే అర్జెంటీనాలోని జెస్యూట్లకు సారథి అయ్యారు. 

1992లో బ్యూనస్‌ ఎయిర్స్‌ సహాయ బిషప్, 1998లో ఆర్చి బిషప్‌ అయ్యారు. 2001లో కార్డినల్‌ అయ్యారు. అనంతరం పోప్‌గా 12 ఏళ్లకు పైగా తన పనితీరుతో చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోప్‌ల్లా రాజప్రాసాదంలో కాకుండా వాటికన్‌లోని ఓ హోటల్లో నివసించారు. 2023 దాకా బెనెడిక్ట్, ఫ్రాన్సిస్‌ రూపంలో వాటికన్‌లో ఏకకాలంలో ఇద్దరు పోప్‌లు ఉండటం ఓ అసాధారణ ఘటనగా నిలిచిపోయింది. అయితే బెనెడిక్ట్‌ అబార్షన్‌ వ్యతిరేక అజెండాను ఫ్రాన్సిస్‌ పూర్తిగా సమర్థించలేదు. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. 

ఎన్నో సంచలనాలు 
శరణార్థులు, అణగారిన వర్గాలతో పాటు స్వలింగ సంపర్కల పట్ల ఫ్రాన్సిస్‌ ఎంతో సహానుభూతి చూపారు. వారితో పాటు పేదలు, ఖైదీలు, అంటరాని వర్గాలకు చర్చి వ్యవస్థ పెద్ద దిక్కుగా నిలవాలని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహాటంగా ప్రకటించారు. అంతేగాక, ‘ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చి ఆశీర్వదించడానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు ప్రీస్ట్‌ బాధ్యతలు స్వీకరించడాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషప్‌లు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికనప్పుడల్లా గట్టిగా ఆక్షేపించారు. 

ఇరాక్‌ పర్యటన 
ఇరాక్‌లో పర్యటించిన తొలి పోప్‌గా ఫ్రాన్సిస్‌ నిలిచారు. అరబ్‌ దేశాల్లోనూ పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. వాటికన్‌ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చి వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయతి్నంచి సంచలనం సృష్టించారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు. పోప్‌ను ఎంపిక చేసే కీలక కార్డినల్‌ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్‌పై క్రిమినల్‌ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. వాటికన్‌ కార్యాలయాలపై పోలీసు దాడు లకూ అనుమతులిచ్చారు! వాటికన్‌ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెర వేశారు. వారందుకునే కానుకలపైనా పరిమితి విధించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫ్రాన్సిస్‌ పనితీరుపై కొన్ని వివాదాలూ తలెత్తకపోలేదు. మైనర్లపై లైంగిక వేధింపుల అభియోగాలున్న కార్డినల్‌ థియోడర్‌ మెక్‌కారిక్‌కు చాలాకాలం పాటు దన్నుగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.            

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement