విజయకేతనం.. సునీత విలియమ్స్‌ వచ్చేసింది.. | Sunita Williams And Butch Wilmore Returned Home | Sakshi
Sakshi News home page

విజయకేతనం.. సునీత విలియమ్స్‌ వచ్చేసింది..

Published Wed, Mar 19 2025 6:55 AM | Last Updated on Wed, Mar 19 2025 10:01 AM

Sunita Williams And Butch Wilmore Returned Home

కేప్‌ కెనావెరాల్‌: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. 

స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ‘ఫ్రీడమ్‌’.. వారిని సురక్షితంగా వారిద్దరినీ భూమి మీదకు తీసుకొచ్చింది. సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్‌ నిక్‌ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ కూడా ఐఎస్‌ఎస్‌ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు.

 

యాత్ర ఇలా కొనసాగింది.. 

  • భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక తలుపు (హ్యాచ్‌) మూసివేత ప్రక్రియ జరిగింది.

  • ఉదయం 10.15 గంటలకు క్రూ డ్రాగన్‌.. ఐఎస్‌ఎస్‌తో విడిపోవడం (అన్‌డాకింగ్‌) మొదలైంది.

  • 10.35 గంటలకు పూర్తిగా విడిపోయింది.

  • భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

  • ఇందుకోసం పలుమార్లు రాకెట్‌ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. 

  • ఆ వెంటనే- భూమిపై ల్యాండింగ్‌ ప్రదేశం దిశగా కోసం క్రూ డ్రాగన్‌ ముందుభాగంలోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది.

  • ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది.

  • 2.17: స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ షురూ 

  • 2.18: లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్‌ పూర్తి

  • 2.35: కక్ష్య నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది. 

  • 2.51: కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ పూర్తయి.. స్పేస్‌క్రాఫ్ట్‌ కిందకు దిగడం ప్రారంభమైంది. 

  • 3.10: డ్రాగన్‌ ఫ్రీడమ్‌ మాడ్యూల్‌ భూవాతావరణంలోకి ప్రవేశించింది. 

  • 3:11అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్‌ ఎక్స్‌ గ్రౌండ్‌ స్టేషన్‌తో సిగ్నల్‌ కట్‌ అయిపోయింది. 

  • 3.21కి సిగ్నల్‌ కలిసింది. 

  • 3.26: భూమికి 5 కి.మీ. ఎత్తులో ఉండగా పారాచూట్‌లు తెరుచుకున్నాయి.  

  • 3.28: డ్రాగన్‌ మాడ్యూల్‌ సురక్షితంగా సముద్రంలో దిగింది.

రీ ఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్‌ను ఛేదిస్తూ కమాండర్‌ నిక్‌ హేగ్‌ మాట్లాడటంతో... కమాండ్‌ సెంటర్‌లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్‌ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే.. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి.

 

 

డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్‌ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్‌ సెంటర్‌లో చప్పట్లు మార్మోగాయి.  ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్‌బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక.. వ్యోమనౌకను మేగన్‌ నౌకపైకి చేర్చారు. ఆపై- లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్‌ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్‌ నిక్‌ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్‌ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. 
క్రూ డ్రాగన్‌ నుంచి బయటకు రాగానే సునీత.. ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement