
యూడీఐడీ నమోదులో తప్పులు ఉండొద్దు
జనగామ: యూనిక్ డిసెబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుల జారీ ప్రక్రియలో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. యూడీఐడీ కార్డులు, సదరం(21డీ) క్యాంపులపై గురువారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి, సెర్ప్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఎంపీడీఓ ఎంపీఈఓ, ఏపీఎం, సీసీ, మీ–సేవా సెంటర్ ఆపరేటర్, దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. www.r-wavaambancar.gov.in వెబ్‌సైట్ ద్వారా యూ డీఐడీ కార్డుల జారీకి కొత్త దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా పీడబ్ల్యూడీ లాగిన్ మాడ్యూల్‌లో దివ్యాంగులకు సంబంధించి న వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని, జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు. అనర్హులకు డిసెబిలిటీ కార్డులు జారీ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహ న కల్పించారు.
ధాన్యం సెంటర్లు, ఇందిరమ్మ ఇళ్లపై..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్మాణాలకు మార్కింగ్, గ్రౌండింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన సర్వే వివరాలను యాప్‌లో నమోదు చేసి పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాల ని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలింపులో అక్రమాలకు చోటివ్వొద్దని, ప్రతీ ట్రాక్టర్‌కు జీపీఎస్ సిస్టం అమర్చాలని పేర్కొన్నారు. ఇసుక తరలింపు వివరాలు జీపీ రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసే 157 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, గన్నీ బ్యాగులు, ఎలక్ట్రానిక్ కాంటాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న వృద్ధాప్య, వితంతు, శాశ్వత వలస పింఛ న్లు, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా దరఖాస్తులను ఈనెల 10 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే రెండు జతల యూనిఫామ్ కొలతల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, నాణ్య తా ప్రమాణాలు పాటించి స్టిచ్చింగ్ చేసేలా అధికా రులు పర్యవేక్షించాలని అన్నారు. ఉపాధి హామీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని, ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తొద్దని, నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో డీఆర్డీఓ వసంత, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక తరలింపు ట్రాక్టర్లకు
జీపీఎస్ ఏర్పాటు చేయాలి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా