
తిమ్మాపూర్‌లో చోరీకి యత్నం
దుండగుడిని పట్టుకున్న గ్రామస్తులు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోగల ఓ ఇంట్లో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించగా, ఓ దుండగుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుందకు చెందిన ఇద్దరు యువకులు కడమంచి రమేష్, శ్రీకాంత్ గురువారం ఉదయం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి పాత ఇంటిలో ఉంచిన ట్రాక్టర్‌కు సంబంధించిన పాత ఇనుప సామాన్లను చోరీ చేసేందుకు యత్నించారు. వెంటనే ఇంటి యజమాని వారిని గుర్తించి కేకలు వేశారు. గ్రామస్తులు ఇంటి వద్దకు వచ్చి నిందితులను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు పారిపోగా రమేష్ గ్రామస్తులకు చిక్కాడు. గ్రామస్తులు వివరాలు సేకరించి అతడిని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.