
‘ఓపెన్’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్నవారు శ్రద్ధతో చదివి వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికై నా, ఉపాధి అవకాశాలకై నా విద్యార్హతలు ముఖ్యమని అన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్హత రెగ్యులర్ అర్హతకు సమానమేనని అన్నారు. ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులంతా తప్పక హాజరై పరీక్ష రాయాలని సూచించారు. డీఈవో జనార్దన్‌రావు మాట్లాడుతూ పదోతరగతిలో 421మంది, ఇంటర్‌లో 881మంది ఓపెన్ స్కూల్ పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సీహెచ్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
భూ భారతిపై అవగాహన కల్పించండి
కరీంనగర్ అర్బన్: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన భూ భారతి చట్టంపై సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగా హన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నా రు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17నుంచి ప్రతీ మండలంలో భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు స్వీకరించాలని అ న్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్‌వో వెంక టేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి చేయండి
జిల్లాలోని పైలట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో కొంత మందికి ఇండ్లు మంజూరు చేశామని, మిగిలిన ఇండ్లను మంజూరు చేసేందుకు జాబితా తయారు చేయాలని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అన్ని ఇండ్లకు త్వరితగతిన 100శాతం మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.