● ఆడియో రికార్డులు బయటపెడతానంటున్న కమలాకర్ ● ఆ నేత ఎవరా? అంటూ జిల్లావ్యాప్తంగా మొదలైన చర్చ ● ఆడియోల్లో ఎవరి పేరు వస్తుందా? అని పార్టీల్లో ఉత్కంఠ ● దుష్ప్రచారంపై కోర్టుకు వెళ్తానంటున్న మాజీ మంత్రి
సాక్షిప్రతినిధి,కరీంనగర్●:
మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్‌ఎఫ్) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో తొలి నుంచి తాను చెబుతున్నదే నిజమైందని, కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఆపారన్న తన మాటలు ఎట్టకేలకు నిజమయ్యాయని, త్వరలోనే తాను ప్రెస్‌మీట్ పెట్టి ఆడియో రికార్డులు బయటపెడతానని గంగుల కమలాకర్ పునరుద్ఘాటిస్తున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్మాణం మొదలైన దరిమిలా.. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కారణంగా ఎల్‌ఎండీ డ్యాం ఉనికికి దెబ్బ వస్తుందని, పర్యావరణంగా సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడి జీవావరణం ధ్వంసమవుతుందంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. తీర్పు వెలువరించే సమయంలో కేసు వేసిన విషయంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు ఆధారంగా గంగుల వేయబోయే అడుగులు రాజకీయ వేడి పుట్టించనున్నాయి.
ఎవరా పెద్ద నాయకుడు?
కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి ఈ వ్యవహారం వెనక ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై గంగుల కమలాకర్ ఆరోపణల ప్రకారం.. కేవలం రాజకీయ కక్ష, కంటగింపు ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా.. సదరు పెద్ద నాయకుడు అడుగడుగునా అడ్డుపడ్డాడని, అతని పాత్రను నిగ్గు తేల్చే నాయకుల ఆడియో సంభాషణల రికార్డులు తమ వద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని బహిర్గతం చేస్తామని మాజీ మంత్రి గంగుల ఘంటాపథంగా చెబుతున్నారు. రూ.540 కోట్లు విడుదలై పనులు సాగుతున్న ప్రాజెక్టుపై ఇలా ఏమాత్రం ఆధారాల్లేని కేసు వేయడం ఏమిటని గంగుల వర్గం గుర్రుగా ఉంది. ప్రాజెక్టు పూర్తయితే తమకు, తమపార్టీకి ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందో? అన్న రాజకీయ కక్షతోనే ఈ కేసు వేయించారని, ఎన్జీటీ ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని తీర్పులో ప్రస్తావించడాన్ని మాజీ మంత్రి వర్గీయులు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా ఎంఆర్‌ఎఫ్‌పై దాఖలైన వ్యాజ్యాన్ని పనికిమాలిన పిటిషన్‌గా ధర్మాసనం పేర్కొనడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు స్వాగతిస్తున్నారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారంపై ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్టు’ కేసు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.
అన్ని పార్టీల్లోనూ చర్చ
ఎప్పుడూ లేనిది మాజీ మంత్రి ఆడియో టేపులు బయట పెడతానంటుండటంతో ఈ విషయం జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. వెనక ఉండి కేసులు వేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అన్న అంశంపై ఎవరి సిద్ధాంతాలను వారు ప్రతిపాదిస్తున్నారు. ఫలానా నాయకుడే ఇది చేయించి ఉంటాడంటే.. కాదు కాదు మరో నాయకుడు చేయించి ఉంటాడని ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. ఎవరి వాదనలు బలపరిచేలా వారు ఉదాహరణలు ఇచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఈ విషయంలో గంగుల వద్ద ఉన్న ఆడియోటేపులు బయటికి వస్తే.. ఆ నాయకుడు ఎవరన్న విషయం బయటికి రానుంది.
రివర్ ఫ్రంట్ వెనక నేతలెవరు?