
భూ భారతితో సమస్యలు పరిష్కారం
శంకరపట్నం(మానకొండర్): ధరణితో భూ సమస్యలు పరిష్కరించలేక కలెక్టర్లం ఇబ్బందులు పడ్డామని, భూభారతితో సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని పంక్షన్‌హాల్‌లో గురువారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 1971లో ఆర్‌ఓఆర్ చట్టం వచ్చిందని, అమలు అయ్యేందుకు కొన్నేళ్లు పట్టినా పకడ్బందీగా అమలు అయ్యాయన్నారు. ధరణి చట్టం తీసుకురావడానికి రాత్రికిరాత్రే కంప్యూటరీకరణ చేయడంతో రైతులకు భూసమస్యలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. భూభారతిలో రెండంచెల అప్పీలు వ్యవస్థ రూపొందించడంతో భూ సమస్యలు తహసీల్దార్, ఆర్టీవో స్థాయిలోనే పరిష్కారం అవుతాయన్నారు. గతంలో భూ ఆక్రమణలు జరిగాయని, వాటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి పటం పొందిపర్చి భూధార్ అమలు చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిలో పర్యాటకులు చనిపోగా సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సదస్సులో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఏవో వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి