
చేతులెత్తేశారా..?
● సమ్మర్ క్యాంపులు ఉన్నట్టా.. లేనట్టా.. ● 2017 నుంచి నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ ● ప్రస్తుతం శిక్షణ శిబిరాల ఊసెత్తని బల్దియా ● ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, చిన్నారులు
కరీంనగర్‌స్పోర్ట్స్: ఏడేళ్ల వ్యవధిలో ఐదు పర్యాయాలు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించిన కరీంనగర్ బల్దియా ఈసారి క్యాంపుల నిర్వహణపై చేతులెత్తేసిందా? అనే అనుమానం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. గతేడాది ఎన్నికల కోడ్ పేరిట శిబిరాలకు చెక్ పెట్టగా ఈ సారి ఏ కారణం చెబుతారో అని వేచి చూస్తున్నారు తల్లిదండ్రులు, చిన్నారులు. పక్క జిల్లాలో శిబిరాల నిర్వహణపై సన్నాహాలు ప్రారంభించగా, క్రీడల కోటగా పేరుగాంచిన కరీంనగర్‌లో ఆ ఊసే లేకుండాపోయింది.
2017 నుంచి ఉచిత శిక్షణ
వేసవి సెలవుల్లో ఇంటిపట్టునే ఉంటున్న చిన్నారులకు కరీంనగర్ నగరపాలక సంస్థ 2017 నుంచి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు జిల్లా క్రీడాశాఖ సహకారంతో నిర్వహిస్తోంది. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఆసక్తి ఉన్న క్రీడాంశాల్లో చిన్నారులు శిక్షణ పొందారు. ఈ ఏడాది వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. కానీ, నగరపాలక సంస్థ క్రీడా శిబిరాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో శిబిరాల్లో 15 క్రీడాంశాల్లో సుమారు 1,500 మంది, 2018లో 20 క్రీడల్లో 2,500, 2019లో 22 క్రీడాంశాల్లో 3వేలు, 2022లో 27 క్రీడల్లో సుమారు 3,200, 2023లో 28 క్రీడల్లో సుమారు 3వేల మంది శిక్షణ తీసుకున్నారు. వేల మందికి తర్ఫీదు ఇచ్చిన బల్దియా ప్రస్తుతం శిబిరాల ఊసెత్తకపోవడం విడ్డూరం. ఈసారి శిబిరాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చినా లాభం లేకుండాపోయింది. ఇప్పటికే శిబిరాల కోసం రోజూ స్టేడియానికి వందల సంఖ్యలో చిన్నారులు వస్తున్నట్లు సమాచారం.
గౌరవ వేతనం ఇవ్వాల్సి వస్తుందనా..?
శిక్షణ శిబిరాల్లో కోచింగ్ ఇచ్చిన కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం ఆనవాయితీ. 2023 మే లో 28 క్రీడాంశాల్లో సుమారు 70 మందికిపైగా కోచ్‌లు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. వీరికి ఇస్తామన్న గౌరవ వేతనం రూ.10వేలు నేటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం శిబిరాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన లేదు. ఒక వేళ శిబిరాలు నిర్వహిస్తే ఇది వరకు కోచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇచ్చి, మలి దశ శిబిరాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని, అదే శిబిరాల జోలికి పోకుండా ఉంటే ఏ సమస్య ఉండదన్న ఆలోచనలో నగరపాలక సంస్థ అధికారులు ఉన్నట్లు పలువురు కోచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శిబిరాలు నిర్వహించాలి
వేసవి క్రీడా శిబిరాలతో క్రీడాకారుల సామర్థ్యాలు మెరుగుపడుతాయి. చిన్నారులు క్రీడల్లో ఉన్నతస్థాయిలో నిలవాలంటే సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. ఈసారి కూడా శిబిరాలు నిర్వహించాలి. కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి.
– బత్తిని శ్రీధర్‌గౌడ్,
ప్రైవేటు పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు

చేతులెత్తేశారా..?

చేతులెత్తేశారా..?