మామిడి మార్కెట్‌లో మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మామిడి మార్కెట్‌లో మాయాజాలం

Published Tue, Apr 29 2025 12:20 AM | Last Updated on Tue, Apr 29 2025 12:20 AM

మామిడ

మామిడి మార్కెట్‌లో మాయాజాలం

● వ్యాపారులదే రాజ్యం.. నామమాత్రమైన అధికారులు ● దోపిడీపై మార్కెటింగ్‌ శాఖకు ఫిర్యాదులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల(చల్‌గల్‌) మామిడి మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. మార్కెట్‌కు మామిడి కాయలు తెచ్చే రైతులు, లీజుదారులను అడుగడుగునా దోచుకుంటున్నారు. ధర విషయంలో రైతులు అన్యాయానికి గురువుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మామిడి మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీ గురించి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. మార్కెట్లో దోపిడీ మాత్రం ఆగడం లేదు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ గురువారం రాత్రి మామిడి మార్కెట్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నోటీసులిచ్చినా అంతంతే..

మామిడి మార్కెట్‌లో మార్కెట్‌ నిబంధనల మేరకు ఓపెన్‌ యాక్షన్‌ పెట్టాలని వ్యాపారులకు నోటీసులిచ్చినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఒక్కరిద్దరు వ్యాపారులు ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుండగా.. చాలామంది వ్యాపారులు కమీషన్‌ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు రైతులకు సరైన ధర రాక, మరోవైపు మార్కెట్‌కు సరైన ఆదాయం లేక రెంటికి చెడ్డ రేవడిలా మామిడి మార్కెట్‌ మారింది. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

లోకల్‌ మార్కెట్‌గా..

చల్‌గల్‌లోని రూ.కోట్ల విలువైన వాలంతరీ స్థలాన్ని మామిడి మార్కెట్‌కు కేటాయిస్తే రోజురోజుకు అభివృద్ధి చెంది ఉత్తర తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా మారాల్సింది పోయి.. చివరకు లోకల్‌ మార్కెట్‌గా మారి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మామిడి మార్కెట్‌లో ఓపెన్‌ మార్కెట్‌ నిర్వహిస్తే.. ఢిల్లీ, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాల నుంచి బడా వ్యాపారులతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులు వస్తారని, తద్వారా వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి ధర పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కాని చాలామంది లోకల్‌ వ్యాపారులు ఓపెన్‌ మార్కెట్‌ను వ్యతిరేకిస్తున్నారు. లోకల్‌ వ్యాపారులు రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి కిలోకు రూ.2–5 కమీషన్‌పై ఢిల్లీ, నాగ్‌పూర్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ వ్యాపారులతో ఏదో ఓ ధర మాట్లాడుకొని లోకల్‌ వ్యాపారులు కాయను నేరుగా పంపిస్తున్నారు.

కటింగ్‌ల పేరిట దోపిడీ

వ్యాపారులు ఆ కటింగ్‌, ఈ కటింగ్‌ అంటూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కాయకు ధర నిర్ణయించిన తర్వాత ప్రైవేట్‌ ఎలక్ట్రానిక్‌ కాంటాపై తూకం వేసి వ్యాపారికి సంబంధించిన షెడ్‌లో కాయలు పోయమంటారు. తూకం వేయించిన కాగితం వెనక వైపునే లెక్కలు వేసి ఇచ్చి డబ్బుల కోసం తర్వాత రమ్మంటారు. కటింగ్‌ల పేరిట వ్యాపారులు రెండు పద్ధతులు అవలంబిస్తున్నారు. మొదటి పద్ధతిలో మార్కెట్‌ ధరకు రూ.3–4 తగ్గించి టన్నుకు క్వింటాల్‌ కాయలను తరుగు పేరిట తీసేస్తున్నారు. రెండో పద్ధతిలో రాటన్‌ పేరిట రైతులు తీసుకొచ్చిన కాయలను గ్రేడింగ్‌ చేసి చిన్న కాయ అంటూ సగానికి సగం ఏరేస్తున్నారు. సగం కాయలకు మంచి ధర, మరో సగం కాయలకు రూ.7–8 ధర నిర్ణయిస్తున్నారు. సూట్‌ పేరిట టన్నుకు 50 కిలోలు తీసేస్తున్నారు. ఇక కమీషన్‌ పేరిట 4 శాతం కటింగ్‌.. ఇలా ఎంత వీలైంతే అంతమేరకు దోచుకునే పనిలో వ్యాపారులున్నారు.

రైతులతో ఆడుకుంటున్న వ్యాపారులు

కోర్రీలు పెడుతూ మామిడి రైతులతో వ్యాపారులు ఆడుకుంటున్నారు. కమీషన్‌ పద్ధతిలో కొనుగోలు చేస్తుండటంతో.. రైతులు కాయలు తెంపే ముందు ఒకటి, రెండు రోజుల ముందు నాలుగైదు శాంపిల్‌ కాయలను తీసుకొచ్చి వ్యాపారులకు చూపిస్తారు. ఓ ధర చెప్పి మార్కెట్‌కు రెండు రోజుల తర్వాత తీసుకరమ్మంటారు. చివరకు రైతులు కాయలను మార్కెట్‌కు తీసుకొచ్చిన తర్వాత కాయలు నాణ్యతగా లేవు.. మాట్లాడుకున్న ధర ఇవ్వం.. మరో ధర ఇస్తామంటూ పేచీలు పెడుతున్నారు. కాయలు చెడిపోతాయనే ఉద్దేశంతో గత్యంతరం లేక ఏదో ఓ ధరకు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ధర తగ్గిస్తున్న వ్యాపారులు

ప్రస్తుతం కొంతమేర మామిడి కాయలు మార్కెట్‌కు వస్తుండటంతో ధర తగ్గిస్తున్నారు. ప్రస్తుతం బెంగినపల్లికి ధర కిలో రూ.25–55, దశేరి రకం కిలో రూ.53–70, హిమాయత్‌ రకం రూ.80–110 వరకు పలుకుతోంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. మామిడి కాయ అంతంతమాత్రంగానే మార్కెట్‌కొస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌కు 1,500–2,000 క్వింటాళ్ల వరకే వచ్చింది.

పట్టించుకోవడం లేదు

ఉత్తర తెలంగాణలో మామిడి మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచిన చల్‌గల్‌ మామిడి మార్కెట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ధరలు, కటింగ్‌ల విషయంలో వ్యాపారుల ఇష్టారాజ్యమే నడుస్తోంది. రైతులను పట్టించుకోవడమే మానేశారు. వ్యాపారుల దోపిడీతో తోటలను ఏదో ఓ ధరకు లీజుకివ్వాల్సిన పరిస్థితి దాపురించింది.

– నక్కల తిరుపతిరెడ్డి, తొంబరావుపేట,

మేడిపల్లి

పరిస్థితులను చక్కదిద్దుతున్నాం

మామిడి మార్కెట్‌ పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. ఓపెన్‌ మార్కెట్‌ను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓపెన్‌ మార్కెట్‌ నిర్వహించిన వ్యాపారులకు నోటీసులిచ్చాం.

– రాజశేఖర్‌,

మార్కెట్‌ కార్యదర్శి, జగిత్యాల

మామిడి మార్కెట్‌లో మాయాజాలం1
1/2

మామిడి మార్కెట్‌లో మాయాజాలం

మామిడి మార్కెట్‌లో మాయాజాలం2
2/2

మామిడి మార్కెట్‌లో మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement