
ఉపాధి కూలీల ఆకలి కేకలు
పామర్రు: మండు టెండలో నిత్యం కష్ట పడుతున్న ఉపాధి కూలీలకు కష్ట కాలం దాపురించింది. రోజంతా రెక్కలు కష్టంతో స్వేదం చిందిస్తున్నా వారికి ఆకలి బాధలు తప్పడం లేదు. కూలి డబ్బులను కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయక పోవడంతో వారు పడుతున్న వేదన వర్ణణాతీతం. సుమారు మూడు నెలలుగా శ్రమిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 2.53 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిలో 3.29 లక్షల మంది సభ్యులు ఉన్నారు. జనవరి 15 నుంచి ఇప్పటి వరకు వారికి దినసరి కూలి అందలేదు. గతంలో వారానికి పది రోజులకు ఒక్కసారి కూలి డబ్బులు చెల్లించేవారు. మూడు నెలల తరబడి కూలి అందకపోవడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో సుమారు 14 లక్షల పని దినాలు కల్పించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా వారు పడుతున్న కష్టానికి ఫలితం రాలేదు.
పండుగలకూ పస్తులే
ఈ ఏడాది ఆరంభంలో జనవరి 15వ తేదీ వరకు కొంత మేర కూలీలకు డబ్బులు అందాయి. ఆ తరువాత నుంచి పెండింగ్ పడుతూ వచ్చారు. జనవరిలో రిపబ్లిక్ డే మొదలుకొని మహా శివరాత్రి, రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ఫ్రైడ్ వంటి పర్వదినాలు వచ్చినప్పటికీ వారికి పస్తులు తప్పడం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంత వరకు విడుదల చేయలేదు. దీంతో కూలీలు పస్తులతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది.
బకాయిల కోసం ఎదురుచూపులు
జిల్లాలో గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు సంబంధించి సుమారు రూ.35 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే సుమారు మూడు లక్షల మంది కూలీలకు ఉపశమనం లభిస్తుంది. కూలీల కుటుంబాలకు మూడు నెలల మొత్తం ఒకేసారి అందిస్తే ఆర్థికంగా కొంత వెసులు బాటు లభిస్తుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
మూడు నెలలుగా అందని వేతనాలు
జిల్లాలో 2.53 లక్షల జాబ్ కార్డులు
సుమారు 3.29 లక్షల మంది కూలీలు
జిల్లాలో రూ.35.45 కోట్ల బకాయిలు