
దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భద్రతా చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆలయానికి నిత్యం వేల మంది భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివస్తుంటారు. వారాంతాల్లో అయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో దుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయంలో కనీస తనిఖీలు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాల సమయంలో దేవస్థానం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మెటల్ డిటెక్టర్లు పని చేయడం లేదు. మహామండపం మొదలు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే వరకు ఎక్కడా కూడా మెటల్ డిటెక్టర్లు పని చేస్తున్న దాఖలాలు లేవు. ఘాట్‌రోడ్డు మార్గంలో ఉన్న మెటల్ డిటెక్టర్లను లక్ష్మీగణపతి మందిరం పక్కనే ఉన్న గోశాలలో భద్రపరిచారు. లక్ష్మీగణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం కోసం వాటిని తొలగించామని సిబ్బంది చెబుతున్నారు. కనీసం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే కీలక మార్గాల్లో వాటిని ఏర్పాటు చేయలేదు. మహామండపం దిగువన ఎటువంటి తనిఖీలు లేకుండానే భక్తుల బ్యాగులను భద్రపరుస్తున్నారు. క్యూలైన్‌లో ప్రవేశించే వారిని కనీస తనిఖీలు చేయడంలేదు. కొంత మంది భక్తులు బ్యాగులు, సంచులతోనే క్యూలైన్ ద్వారా అమ్మ వారి ఆలయ ముఖ మండపం వరకు వచ్చేస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది చేతిలో హ్యాండ్ డిటెక్టర్లు కనిపించడం లేదు. అధికారులు తక్షణం స్పందించి ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.
క్యూలైన్లలో పనిచేయని మెటల్ డిటెక్టర్లు సెక్యూరిటీ చేతిలో కనిపించని హ్యాండ్ డిటెక్టర్లు ఆలయ ప్రాంగణంలో మచ్చుకై నా కనిపించని తనిఖీలు ఆలయంలోకి బ్యాగులు, సంచులతో వస్తున్న భక్తులు

దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం

దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం

దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం