
‘‘అవును రష్మికతో చేస్తున్నా..తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తా..మీకేంటి ప్రాబ్లమ్?’’ అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్‌ఖాన్ ప్రశ్నలో విసుగును గమనించారా? మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు. కొంత కాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు గురవుతున్నారు.
వృధ్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయస్సు గల మహిళా కథానాయకులతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతోంది. కొందరు దీనిని దీనిని వృత్తి పరమైన అంశంగా సమర్థిస్తున్నారు. మరికొందరు, ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన నటీమణులకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు.
తమ కన్నా బాగా తక్కువ వయసు ఉన్న వారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్లు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారింది.. అయితే చర్చా వేదికలు పెరగడం, భావ వ్యక్తీకరణ మార్గాలు విస్త్రుతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్‌ను నాన్సెన్స్‌గా తిట్టిపోయడం కూడా పెరుగుతోంది.
ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్‌లు తమ కన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా...ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడవు. అదేపని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలు చేస్తే మాత్రం విమర్శకులు నోళ్లకు పదను పెడుతున్నారు. అందుకే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నాడు. వయసు కనపడనీయని నాగార్జున మన్మధుడు 2లో రకుల్‌కి ముద్దొచ్చాడేమో కానీ... మరోవైపు విమర్శకుల నోటికి బాగా పనిచెప్పాడు. అలాగే హీరో రవితేజ కూడా గత కొంత కాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు.
హీరోలు తమకన్నా కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్‌లో సర్వసాధారణం. ఎప్పుడో 1980లలోనే దయావన్ లో వినోద్ ఖన్నా తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన మాధురి దీక్షిత్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద్‌లో, సీనియర్ అమితాబ్ బచ్చన్ తన కంటే 46 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న జియాఖాన్ తో కలిసి నటించాడు. ఇక దీపికా పదుకొణె ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా 20 ఏళ్ల సీనియర్ షారూఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేసింది. కాగా, రబ్ నే బనా ది జోడిలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారూఖ్ కంటే 23 ఏళ్లు చిన్నది. గజినిలో అమీర్ ఖాన్, సహ నటి కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 44 ఏళ్ల అజయ్ దేవగన్ 23 ఏళ్ల తమన్నాతో కలిసి హిమ్మత్‌వాలా చేశాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోన్నట్టు కనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ ఏక్ థా టైగర్‌లో తనకన్నా 19 ఏళ్లు చిన్నదైన కత్రినా కైఫ్‌తో నటించాడు. దబాంగ్‌లో 20 ఏళ్ల చిన్నదైన సోనాక్షి సిన్హా తో నటించాడు. ఇప్పుడు ఏకంగా తనకన్నా 32ఏళ్ల చిన్నదైన రష్మిక మందన్నతో జోడీ కట్టాడు. మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన సమకాలీకుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్‌తో స్టెప్స్ వేయడం చూశాం.
ఈ పరిస్థితి మారాలని, హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకొట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని, వయసు పెరుగుతున్న నటీమణులకు అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పటికీ మాధురీ దీక్షిత్ నటిస్తున్నా ఆమె సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాల్లేవు అలాగే సుహాసిని, రాధిక తదితరులు ఉన్నా వారు చిరంజీవి, బాలకృష్ణల పక్కన హీరోయిన్స్‌గా ఎంపిక కాలేదు.. ఈ పరిస్థితి హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాళ్ అనే పాత కాలపు ధోరణికి బలం చేకూరుస్తోందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు... సీనియర్ హీరోల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో...చూడాలి.