
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా ఉంది.
సెన్సార్ రిపోర్ట్‌లో ఏముందంటే?
చాలాకాలం తర్వాత విజయశాంతి పోలీసాఫీసర్‌గా నటించిన సినిమా ఇది. ఇందులో విజయశాంతి న్యాయం కోసం పోరాడే పోలీసుగా తన నటనతో మెప్పిస్తుందని సెన్సార్ నివేదికలో పేర్కొన్నారు. తల్లి-కొడుకు మధ్య సంఘర్షణ కథకు ప్రధానంగా ఉండనుందని తెలిపారు. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఇది చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని టాక్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్సే రాలేదంటున్నారు.
కుటుంబ బంధాలు, త్యాగాలతో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిధంగా ఉంటుందంటున్నారు. యాక్షన్ సన్నివేశాలకు సైతం చోటు ఉందట. సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయని.. ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు మరో బ్లాక్‌బస్టర్‌గా మారడం ఖాయం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని బల్లగుద్ది చెప్తున్నారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
చదవండి: ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్ ఎందుకంటే?: హీరోయిన్