
– శ్రీనిధీ శెట్టి
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్‌కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్‌గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్‌లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి.
‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు.