
దీప్తి గంటా, శైలేష్ కొలను, విశ్వక్ సేన్, రాజమౌళి, నాని, శ్రీనిధీ శెట్టి, అడివి శేష్, ప్రశాంతి తిపిర్నేని
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్‌లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు.
ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్‌లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను.
‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.
కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు.
నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.
ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.