
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్‌లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.
అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.
కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
