
ధాన్యం కొనుగోలుకు 384 కేంద్రాలు
చిట్యాల : యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 384 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ కార్యాలయ నూతన భవనాన్ని, వెలిమినేడు, పెద్దకాపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సమన్యయంతో పని చేసి ధాన్యం కొనుగోలును వేగంవంతం చేయాలన్నారు. ధాన్యం డబ్బులను వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చేలా ఏఈఓలు, కేంద్రాల నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో 45 దొడ్డు రకం, 05 సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, సీఈఓ రాజమల్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పిశాటి భీష్మారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, డైరెక్టర్ ఎదుళ్ల అజిత్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సిహ, సుర్కంటి సత్తిరెడ్డి, కొంపెల్లి వెంకట్‌రెడ్డి, గోలి గణేష్ పాల్గొన్నారు.
14 వరకు రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాస పథకానికి ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు, దివ్యాంగులు, తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గతంలో ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు అన్ని పత్రాలను జతచేసి దరఖాస్తులను ఆయా కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీపీ వర్గాల ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి