
ప్రధాని మోదీకి తెలిపిన సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ఆహ్వానం
శ్రీశైలం సందర్శించాలని వినతి
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టే పోరాటంలో అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ఆయన ప్రధానితో చెప్పారు. అమరావతిలో మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అమరావతిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ప్రధానికి వివరించగా, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని, ఆర్‌ఐఎన్‌ఎల్ గురించి ప్రధానికి వివరించిన చంద్రబాబు.. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు.