
భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరానికి దేశం నలుమూలల నుంచే కాదు.. యావత్ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. పచ్చని గడ్డి మైదానాలు.. దూరంగా ఫైన్ చెట్ల మధ్య నుంచి కనిపించే మంచుపర్వతాలు చూపరులను ఎంతో ఆకట్టుకునే ఏప్రిల్-జూన్ సీజన్ మరేంతో ప్రత్యేకంగా ఉండేది. అలాంటి సీజన్ ఇలా బోసిపోయి ఉంటుందని అక్కడి టూరిస్ట్ గైడులు, వ్యాపారులు కలలో కూడా ఊహించి ఉండరు!.
పహల్గాం ఉగ్రదాడితో.. కశ్మీర్ పర్యాటకాన్ని చీకట్లు కమ్మేశాయి. మంగళవారం మధ్యాహ్నాం ఉగ్రదాడి జరగ్గా.. బుధవారం ఉదయం నుంచే పర్యాటకులు శరవేగంగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. శ్రీనగర్ వెళ్లే విమానాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తుండగా.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇళ్ల రైలు ప్రయాణాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణాలు కన్ఫర్మ్ కాగా.. హోటల్స్, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, రోడ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు పర్యాటకులు.
48 గంటలు.. ఎంత మారిపోయిందో?
పహల్గాం ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండు రోజులు గడిచింది. ఈ రెండు రోజులు మొత్తం జమ్ము కశ్మీర్ పర్యటకం స్తంభించిపోయింది. జమ్ము కశ్మీర్‌కు మణిహారంగా భావించే దాల్ సరస్సు చుట్టుపక్కల ఒక్క పర్యాటకుడు కూడా కనిపించలేదంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. నిత్యం టూరిస్టులతో బిజీబిజీగా గడిపే షికారాలు.. మూలనపడ్డాయి. అలాగే.. దాడి జరిగిన బైసరన్ లోయ పూర్తిగా సైన్యం అదుపులో ఉండిపోయింది. ఇక మిగతా పర్యాటక ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది. పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.

జీవనాధారం దెబ్బ తింటుందనే..
పహల్గాం దాడి.. తదనంతర పరిణామాలు జమ్ము కశ్మీర్‌కు మళ్లీ పాత కల్లోల రోజులను గుర్తు చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ మే జూన్ నెలల జమ్ము పర్యాటకానికి ఎంత కీలకం. అలాంటి సమయంలో.. అదీ పర్యాటకుల మీద జరిగిన ఉగ్రదాడి కశ్మీర్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టిన చీడపురుగుల్ని వెతికి నలిపేయాలంటూ పద్మశ్రీ గులాం రసూల్‌ఖాన్ కోరుతున్నారు. ‘‘ఇక్కడి జనాలకు పర్యాటకమే జీవనాధారం. అలాంటిది దెబ్బ తింటే వాళ్లు ఎలా బతుకుతారు?’’ అని ప్రశ్నిస్తున్నారాయన. ఈ క్రమంలో టూరిస్టులకు కొందరు వ్యాపారులు ధైర్యం చెబుతూ.. బతిమాలుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
రగిలిపోయిన కశ్మీర్ ప్రజలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్‌లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగింది బుధవారమే. గత 35 ఏళ్లలో ఏప్రిల్ 23వ తేదీన కశ్మీర్ తొలిసారిగా మొత్తం మూత పడింది. సాధారణ ప్రజలు, వర్తకులంతా రోడ్డెక్కి ఉగ్ర చర్యను ఖండించారు. ఇది తమ ఆత్మపై జరిగిన దాడిగా భావించి ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని, నిరసన ర్యాలీలో కలిసి రావాలని మసీదుల్లోని మైకుల ద్వారా విజ్ఞప్తులు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, ఐ యామ్ ఇండియన్ అంటూ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు.

పర్యాటకులకు సాయం
జమ్ము కశ్మీర్ టూరిజం విభాగం ధైర్యం చెబుతున్నప్పటికీ.. పర్యాటకులు మాత్రం కశ్మీర్‌ను వీడడం ఆపడం లేదు. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పర్యాటకులకు సాయంగా నిలుస్తున్నారు. ఉచితంగా ఆహార పొట్లాలను, మంచి నీటిని అందిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత స్వస్థలాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోయిన వాళ్లకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మరికొందరు డ్రైవర్లు వాళ్లను రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉచితంగా దించుతున్నారు. ఎంతో కొంత డబ్బు ఇవ్వడానికి పర్యాటకులు ప్రయత్నిస్తున్నా.. వాళ్లు వద్దని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సాయాన్ని కూడా కొందరు విమర్శిస్తుండగా.. ఎక్కువ మంది అభినందిస్తున్నారు.
‘‘మేమూ మనుషులమే. ఇది పర్యాటకమో.. మా ఆదాయానికో సంబంధించింది కాదు. సరదాగా కుటుంబాలతో వచ్చిన ఆ పర్యాటకులు చేసిన తప్పేంటి?. ఈ దాడికి పాల్పడిన వాళ్లను సైన్యం వదిలిపెట్టకూడదు. అవసరమైతే మేమూ సైన్యానికి మా వంతు సాయం అందిస్తాం. ఇది డబ్బో, వ్యాపారానికో సంబంధించింది కాదు. మానవత్వానికి సంబంధించింది. అలాంటిది.. మానవత్వం మీద దాడి జరిగింది మరి’’ అని కొందరు కశ్మీరీలు భావోద్వేగంగా చెబుతున్నారు.
కొసమెరుపు..
బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య.. దాల్ సరస్సులో షికారా ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకవైపు టూరిస్టులు ఆ వైపు వెళ్లేందుకు జంకుతుంటే.. ఆమె మాత్రం ఆ ప్రయాణం రద్దు చేసుకోవడం ఇష్టం లేక ఆస్వాదించానంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.