
కట్టుకున్న పెళ్లానికి ముఖం చాటేసిన వైనం
నాగర్‌కోయిల్‌లో శవమై వెలుగులోకి..!
తమిళనాడు: తనకు వివాహమైనప్పటికీ స్నేహితుడి భార్యను తీసుకెళ్లి గుట్టుగా కాపురం చేస్తున్న వ్యక్తి చివరకు అనుమానాస్పద స్థితిలో శవమై వెలుగులోకి వచ్చాడు. అతడితో సహజీవనం చేస్తున్న స్నేహితుడి భార్య అదృశ్యం కావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని కటైమేడు గ్రామానికి చెందిన గోకుల్(25) వెల్డింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతడు ఆంబూరుకు చెందిన తన స్నేహితుడి భార్యను నాగర్‌కోయిల్‌కు తీసుకెళ్లి అక్కడే ఒక అద్దె ఇంట ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వ్యవహారం గోకుల్ భార్య తులసికి తెలియడంతో ఆమె ఎన్నోసార్లు అతడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తూండడంతో అప్పట్లో పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో గోకుల్ నివసిస్తున్న ఇంటి నుంచి గురువారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాళం వేసి ఉండడంతో దానిని పగలగొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. గోకుల్ విగతజీవిగా ఉండటం గుర్తించారు. దీంతో వేలూరులోని అతని భార్యకు సమాచారమిచ్చారు. అయితే గోకుల్‌తో ఉన్న మహిళ ఏమైంది? గోకుల్ హత్యకు గురయ్యాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.