
దేశ వెయ్యేళ్ల భవితను నిర్దేశించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం
సివిల్ సర్విసెస్ డే కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాతతరం పరిపాలనా విధానలతో పాలన కొనసాగదని, తమ ప్రభుత్వ హయాంలో వెయ్యేళ్ల దేశ భవితను నిర్దేశించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 17వ ‘సివిల్ సర్విసెస్ డే’కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సివిల్ సర్విస్ అధికారులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ప్రభుత్వాధికారులు(బ్యూరోక్రసీ) అంటే దేశ పారిశ్రామికీకరణ, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రతిబంధకాలుగా ఉండేవారనే అపవాదు ఉండేది. కాలంచెల్లిన నియమనిబంధనలను కఠినంగా అమలుచేసేవారు.
ఇప్పుడు కాలం మారింది. పౌరులు సైతం నూతన వ్యాపారాలు మొదలుపెట్టే వాతావరణం బ్యూరోక్రసీ కల్పిస్తోంది. కొత్త వ్యాపారాల ఏర్పాటులో ఎదురయ్యే అడ్డంకులను బ్యూరోక్రసీ తొలగిస్తోంది. ఇప్పుడు భారతీయ సమాజంలో యువత, రైతులు, మహిళల్లో అభివృద్ధి ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి. వాటిని వేగంగా సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే మా ప్రభుత్వం మరో 1,000 సంవత్సరాల దేశ భవితను దృష్టిలో ఉంచుకుని నేడు నిర్ణయాలు తీసుకుంటోంది’’అని చెప్పారు.
భారత్ లక్ష్యాలు ఎన్నెన్నో..
‘‘ఇంధన భద్రత, శుద్ధ ఇంధనం, క్రీడలు, అంతరిక్ష ఆవిష్కరణ తదితర రంగాల్లో రాబోయే రోజుల్లో భారత్ అగ్రగామిగా మారాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీలైనంత త్వరగా ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించేందుకు సివిల్ సర్వెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి. లక్ష్యం ఆలస్యంకాకుండా పనిలో కార్యోన్ముఖులు కావాలి.
భారత సమ్మిళిత అభివృద్ధి అంటే దేశంలోని ఏ ఒక్క గ్రామం, కుటుంబం, పౌరుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోకూడదు. చిన్నపాటి మార్పు నిజమైన అభివృద్ధి అనిపించుకోదు. విస్తృతస్థాయిలో అభివృద్ధిచెందడమే నిజమైన అభివృద్ధి. కొత్త పథకాలు ప్రారంభించినంతమాత్రాన నాణ్యమైన పరిపాలన అందిస్తున్నట్లు కాదు. పథకాల ఫలాలు లబి్ధదారులందరికీ అందినప్పుడే పరిపాలన సవ్యంగా సాగుతుందని అర్థం’’అంటూ మోదీ గత పదేళ్లలో తమ ప్రభుత్వహయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించారు.
నాగరిక్ దేవో భవా..
అణగారిన వర్గాల సమస్యలను పట్టించుకోవాలని అధికారులకు మోదీ సూచించారు. ‘‘తమ గోడును మీ ముందు వెళ్లబోసుకునేందకు వచ్చే పౌరులను పట్టించుకోండి. అతిథి దేవో భవ తరహాలో నాగరిక్ దేవో భవా(పౌరులూ దైవంతో సమానం)ను పాటించండి. అంకితభావం, తపనతో బాధ్యతాయుతంగా ఉంటూ పౌరుల సమస్యలను పరిష్కరించండి. టెక్నాలజీతో పరుగులు తీస్తున్న ఈ కాలంలో పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని తదనుగుణంగా పాలించడం. ఏఐ, క్వాంటమ్ ఫిజిక్స్ వంటి వాటితో దేశ భవిష్యత్ అంతా టెక్నాలజీ విప్లవంతో ముడిపడి ఉంది. అందుకే మీరంతా టెక్నాలజీపై పట్టుసాధించి పౌరుల ఆకాంక్షలను తీర్చడంలో ఆ సాంకేతికతను వినియోగించండి’’అని మోదీ సూచించారు.