
ఊబకాయానికి చెక్ పెట్టండి
ప్రధాని మోదీ పిలుపు
సిల్వాస్సా: దేశంలో ఊబకాయ సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా మారుతారని అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో అవస్థలు పడే ప్రమాదం ఉందన్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఖ్య అని చెప్పారు.
ఒబేసిటీ అతిపెద్ద సవాలుగా మారిందని అన్నారు. ఊబకాయ సమస్యను అధిగమించడానికి వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని మరోసారి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వంట నూనెల విని యోగం తగ్గించుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. నిత్యం వ్యాయామం చేయాలని, శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించుకోవాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించడానికి దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ షాపుల్లో ఔషధాలు కొనుగోలు చేయడం వల్ల మధ్య తరగతి ప్రజలు, పేదలకు ఇప్పటికే రూ.30,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. ప్రధాని మోదీ శుక్రవారం కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో పర్యటించారు. సిల్వాస్సా పట్టణం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.460 కోట్లతో నిర్మించిన ‘నమో హాస్పిటల్’ను ప్రారంభించారు.
11 నుంచి మోదీ మారిషస్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీ నుంచి మారిషస్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుందని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్‌గూలం ఆహా్వనం మేరకు మారిషస్ జాతీయ దినోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేసింది.
రూ. 32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలో లెక్కించలేరు
కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ
సూరత్: చట్టసభల్లో సున్నా సీట్లు ఉన్న రాజకీయ పార్టీలు రూ.32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్కించలేవని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ కింద పేదలకు ఇప్పటిదాకా రూ.32 లక్షల కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి ఆదాయపు పన్ను మినహాయింపును రూ.12 లక్షల వరకు పెంచామని అన్నారు. శుక్రవారం గుజరాత్‌లోని సూరత్‌లో ‘సంతృప్తస్థాయిలో ఆహార భద్రత’ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను శనివారం పూర్తిగా మహిళలకే అప్పగించబోతున్నానని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.