
కర్ణాటకలో విద్యార్థులను పరీక్షకు అనుమతించని పోలీసులు
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.
జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్‌లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.