
బెంగళూరులో సంచలనం
యశవంతపుర: కర్ణాటకలో సంచలనం చోటుచేసుకుంది. విశ్రాంత డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆదివారం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలోని నివాసంలో ఆయన కత్తి పోట్లకు గురయ్యారు. శనివారం రాత్రి ఘటన జరగ్గా ఆదివారం ఉదయం బయటపడింది. ప్రకాశ్ భార్య పల్లవి ఈ విషయం బంధువులకు తెలపగా, వారు పోలీసులకు సమాచారం అందించారు.
వారొచ్చి చూడగా మూడంతస్తుల నివాసం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై అనేక కత్తి గాట్లున్నాయి. కత్తితో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఆయన భార్య పల్లవితోపాటు కుమార్తెను పోలీసులు ప్రశి్నస్తున్నారు. విషయం తెల్సిన సీనియర్ పోలీసు అధికారులు ఆయన నివాసానికి తరలివచ్చారు. ఓం ప్రకాశ్ దంపతుల మధ్య కొంతకాలంగా ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
తనకు దగ్గరి వారి నుంచే ప్రాణహాని ఉన్నట్లు ప్రకాశ్ ఇటీవల కొందరు సన్నిహితులతో ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రకాశ్‌కు సన్నిహితులైన కుటుంబసభ్యులే కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ బిహార్‌లోని చంపారన్ వాసి. అక్కడే జియాలజీలో పీజీ చేశారు. 1981లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. బళ్లారిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్‌లో పూర్తికాలం కర్ణాటకలో పనిచేశారు. భత్కల్ మత కలహాల నివారణ సహా పలు ముఖ్య ఆపరేషన్లలో పాల్గొన్నారు.
