బనశంకరి: ఎస్‌ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగు చూడటంతో ఆ పరీక్షను రద్దు చేసినట్లు హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ మొత్తం 545 ఎస్‌ఐ పోస్టులకు 2021 ఆగష్టు 3న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 54,289 మంది అభ్యర్దులు హాజరైనట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో వెలుగుచూడటంతో పరీక్షను రద్దు చేశామన్నారు.
కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని త్వరలో తేదీ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఎంపికైన వారు కూడా పరీక్ష రాయాలన్నారు. ఎస్‌ఐ పరీక్షలో కుమ్మక్కైన వారికి మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చేదిలేదన్నారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్లూటూత్ వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో నిర్ధారణ అయ్యిందని, ఇందులో ఎవరు భాగస్వాములైనప్పటికీ విడిచిపెట్టేదిలేదన్నారు.
ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది : ప్రియాంక ఖర్గే
దివ్యహాగరగి అరెస్ట్‌పై మాజీమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఎస్‌ఐ అభ్యర్థుల నుంచి వసూలు చేసిన కోట్లాదిరూపాయల డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఐడీ బృందం పుణెలో దివ్య హాగరగితో సహా ఆరుగురిని అరెస్ట్‌చేయడాన్ని ప్రియాంక్ ఖర్గే స్వాగతించారు. పరీక్ష కేంద్రాలు కేటాయించడం, డబ్బు ఇచ్చిన అభ్యర్థులకు నిర్దిష్టమైన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే సదుపాయం కల్పించడం లాంటి పనులు చేపట్టడం వెనుక ప్రముఖులు ఉన్నారని, వారిపై సీఐడీ విచారణ చేపట్టలేదన్నారు. అసలైన తిమింగలాలను పట్టుకోవాలన్నారు.
కింగ్‌పిన్ దివ్య అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాల కేసులో ప్రధాన సూత్రధారి దివ్య హాగరగి, కలబురిగి జ్ఞానజ్యోతి విద్యాసంస్థ ప్రిన్సిపాల్ కాశీనాథ్, ఇని్వజిలేటర్లు అర్చన, సునంద, ఎస్‌ఐ అభ్యర్థిని శాంతాబాయి, వీరికి ఆశ్రయమిచ్చిన పారిశ్రామికవేత్త సురేశ్‌ను సీఐడీ ఎస్‌పీ రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం గురువారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని పుణెలో అరెస్ట్ చేసింది. వీరిని శుక్రవారం కలబురిగి సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గురువారం ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి పాటిల్‌ను విచారణ చేపట్టగా దివ్య హాగరగితో పాటు ఐదుగురు పుణెలో తలదాచుకున్నట్లు సమాచారం అందించారు. గురువారం రాత్రి సీఐడీ బృందం మహారాష్ట్రకు వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేసింది.
కస్టడీకి నిందితులు..
దివ్యతోసహా ఆరుగురిని వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం కలబురిగి ఒకటవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 11 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇక, దివ్య హాగరగితోసహా ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయంపై రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్ సీఎం బసవరాజ బొమ్మైకి సమాచారం అందించారు. ఆర్‌టీ.నగరలో ఉన్న సీఎం నివాసానికి ప్రవీణ్‌సూద్ విచ్చేసి వివరాలు తెలియజేశారు. ఈ కేసులో ఎవరు భాగస్వాములైనప్పటికీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment