
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు.
తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్‌ఎస్‌ఎస్‌పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్‌సీఈఆర్‌టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను
నడుపుతున్నారు.