
బెంగళూరు: ‘పాస్ అయ్యేందుకు లంచమా?!’ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులు ఆన్సర్ షీట్లలో నోట్లు పెట్టి, పాస్ చేయమంటూ ఇన్విజిలేటర్లను అభ్యర్థించిన సంఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి
కర్ణాటక రాష్ట్రం (Karnataka) బెల్గావి జిల్లా చిక్కోడిటౌన్‌లో పదోతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకనం చివరి అంకానికి చేరుకుంది. అయితే ఈ పదోతరగతి పరీక్షాపేపర్ల మూల్యాంకనం సమయంలో పలువురు ఇన్విజిలేటర్లకు ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు తారసపడ్డాయి. దీంతో కంగుతిన్న ఇన్విజిలేటర్లు ఆన్సర్ షీట్లలో ఈ కరెన్సీ నోట్లు ఎందుకు వచ్చాయా? అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
‘సార్.. సార్ నన్ను పాస్ చేయండి. మీ దణ్ణం పెడతా. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. సార్ ఇవిగో రూ.500 ఛాయ్ తాగండి.. నన్ను పాస్ చేయండి. నన్ను పాస్ చేయించలేదనుకో అంటూ ఇలా విద్యార్థులు ఎగ్జామ్స్ ఆన్సర్ షీట్ల మీద పలువురు విద్యార్థులు ప్రాధేయపడుతూ రాశారు. వారిలో ఓ పదో తరగతి విద్యార్థి తన ఆన్సర్ షీట్ మీద రూ.500 నోటు పెట్టి పాస్ చేయమని అభ్యర్థించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రిక్వెస్ట్ చూసిన ఓ ఇన్విజిలేటర్ ‘మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు’ అంటూ ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఓ విద్యార్థి రూ.500 నోటు ఇస్తే మరికొందరు విద్యార్థులు తమకు పలు రిక్వెస్టులు చేసినట్లు చీక్కోడి టౌన్‌లో పదో తరగతి పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేస్తున్న ఇన్విజిలేటర్లు చెబుతున్నారు. వాటిల్లో విద్యార్థులు అభ్యర్థనలు ఇలా ఉన్నాయి.
ప్లీజ్ పాస్ చేయండి సార్. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది.
నేను పాసాయితే నా ప్రేమను కొనసాగిస్తా
సార్ ఇదిగో రూ.500 .. ఛాయ్ తాగి నన్ను పాస్ చేయండి
మీరు నన్ను పాస్ చేయిస్తే .. నేను మీకు డబ్బులిస్తా
నేను పాస్ కాకపోతే మా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరూ అని ఆన్సర్ షీట్లో రాశారు.
చివరికి పలువురు ఇన్విజిలేటర్లు ఆ ఆన్సర్ షీట్లలోని కరెన్సీ నోట్లను ఉన్నతాధికారులకు అందించారు. విద్యార్థులు రాసిన ఆన్సర్ల ఆధారంగా మార్కులు వేశారు.