
ఘర్ వాపసీకి సిద్ధమైన బహిష్కృత నేతలు
యూపీ అసెంబ్లీ ఎన్నికలపై మాయావతి గురి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయ పావులు కదుపుతున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో ఈసారైనా కనీసం డబుల్ డిజిట్‌తో అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నది ఆమె లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ముఖ్యంగా ఘర్‌వాపసీ పై దృష్టి పెట్టారు. ఆకాశ్ ఆనంద్, నగీనా మాజీ ఎంపీ గిరీశ్ చంద్ర తిరిగి పార్టీలోకి వచ్చిన తర్వాత, పశ్చిమ యూపీ ప్రాంతానికి చెందిన పార్టీ మాజీ నాయకులను దారి లోకి తెచ్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన, బయటకు వెళ్లిన కొందరు నేతలు తిరిగి పారీ్టలోకి వచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా తిరిగి పార్టీ ఛత్రం కిందికి వస్తే బీఎస్పీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందని ఆమె అంచనాగా ఉంది.
ఒకప్పుడు ఘన చరిత్ర
1984లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న బీఎస్పీ ఇప్పుడు పతనావస్థలో ఉంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారీ్టతో యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన మాయావతి...ఆ తర్వాత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 20 సీట్లు సాధించిన ఆ పార్టీ, 2014లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, 2019 ఎన్నికల్లో ఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో కలిసి బరిలో దిగి 10 చోట్ల విజయం సాధించిన బీఎస్పీ 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలో కూడా జెండా ఎగురవేయలేకపోయింది. అంతేగాక 2012–2024 మధ్య జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తన ఉనికిని సైతం చాటుకోలేక చతికిలపడింది.
పాత నేతలకు తిరిగి బాధ్యతలు
2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఎస్పీకి క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు తగ్గిపోయిన నేపథ్యంలో, ఒక్కరొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. కాగా పశ్చిమ యూపీ లో ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన 15 మందికి పైగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల్లో కొందరిని క్రమశిక్షణా రాహిత్యం కారణంతో మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు. మరికొందరు తమకు తాముగానే పార్టీని వీడారు. ఇప్పుడు వీరందరిపైనా బీఎస్పీ కన్నేసింది. అలాంటి కొందరు నేతలు పారీ్టతో టచ్‌లో కూడా ఉన్నారు. అయితే, ఇటీవల అధినేత్రి మాయావతికి క్షమాపణ చెప్పిన తర్వాత మేనల్లుడు ఆకాశ్ ఆనంద్, ఆ తర్వాత మాజీ ఎంపీ గిరీశ్ చంద్ర తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో గిరీశ్ చంద్రకు బిజ్నోర్, అమ్రోహా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అధినేత్రి బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నాలుగు నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రమోద్ నిరంకారిని రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ నియమించారు.