
అనుబంధ విభాగాలే పార్టీకి బలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అనుబంధ విభాగాల అధ్యక్షులు కీలకపాత్ర పోషించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పార్టీకి అనుబంధ విభాగాలు బ్యాక్‌బోన్ లాంటివని ఆయన పేర్కొన్నారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయితో పాటు, గ్రామ డివిజన్ స్థాయి అనుబంధ విభాగాల కమిటీలను పూర్తి చేయాలని ఆయా విభాగాల అధ్యక్షులను అవినాష్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయ్యే విధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు ఏర్పాటు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్ట పడేవారికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎంపికై న వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్