
జయరాం పంగి
జయపురం: కొరాపుట్ జిల్లాలో ఆదివాసీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి జయరాం పంగి రాజకీయ పరిస్థితి అగమ్యగోచరమైంది. ఆయన ఎన్నో ఆశలతో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా కొరాపుట్ పార్లమెంట్ స్థానానికి గానీ, పొట్టంగి ఎమ్మెల్యే స్థానానికి గానీ టిక్కెట్టు లభిస్తుందన్న ఆశతో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కొరాపుట్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క, పొట్టంగి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రామచంద్ర కడమ్‌లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో పంగి ఆశలు అడియాశలయ్యాయి. కొరాపుట్ పార్లమెంట్ నియోజకవర్గంలో జయరాం పంగి 2009 ఎన్నికల్లో గిరిదారి గొమాంగోపై మొదటిసారి గెలిపొందారు. అదేవిధంగా పొట్టంగి విధానసభ నియోజకవర్గంలో ఆయన 1977, 1990, 2000, 2004లలో ఎమ్మెల్యేగా గెలిపొందారు.
● బీజేడీ నుంచి సస్పెండ్ చేయడంతో...
జయరాం పంగి కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్షుడిగా దీర్ఘకాలం పార్టీ బలపడేందుకు కృషి చేశారు. అయితే కొన్ని అనుకోని కారణాల వలన పంగిని పార్టీ నుంచి తొలగించడంతో జిల్లాలో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన గిరిధారి గొమాంగోతో కలిసి హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తెలంగాణలో ఓటమి చెందడంతో జయరాం పంగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అతడిని రాష్ట్ర ఆదివాసీ సెల్ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఇటీవల పొట్టంగి నియోజకవర్గంలో అతడి మద్దతుదారులతో సమావేశమైన తర్వాత పార్టీ టిక్కెట్టు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆయనకు పార్టీ టిక్కెట్టు కేటాయించకపోవడంతో నిరాశ చెందారు. అతడి అనుచరులు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచనలో పడిపోయారు.