
గ్యాస్ ధరలు తగ్గించాలని ఆందోళన
జయపురం: పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. 26 వ జాతీయ రహదారి జయపురం కూడలి వద్ద ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళన చేశాయి. జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో మాట్లాడుతూ నేడు కేంద్రంలోను, రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని, వీరి వల్ల ప్రజలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నో హామీలు గుప్పించిందని, వాటిని తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త ఇంటిముందు హుండీలు ఏర్పాటు చేసి చందాలు వసూలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 25 వ తేదీన పట్టణంలో నిధి సంగ్రహ అభిజాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆందోళనలో రాష్ట్ర కమ్యూనిస్టు నేత ప్రమోద్ కుమార్ మహంతి, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, అజిత్ పట్నాయిక్,ప్రినాథ్ టంగా, దామోదర పంగి, లక్ష్మణ పంగి, సుకుమార్ పొరజ, మనోహర హరిజన్ మొదలగు వారు పాల్గొన్నారు.