
29న కలెక్టర్ ద్వారా ప్రధానికి మెమొరాండం సమర్పణ
జయపురం: ప్రధాన మంత్రి పలు వాగ్దానాలు చేస్తూ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారని, అయితే ఆ వాగ్దానాలు అమలు చేయటం లేదని ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి విమర్శించారు. మంగళవారం స్థానిక యాదవ భవనంలో కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పెన్షన్ దారుల సమావేశంలో మహంతి అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నళినీ కాంత రథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి పెన్షన్లు పెంచుతామని, కనీస పెన్షన్ పెరుగుతాయని ఆశలు చూపారని అయితే ఆ వాగ్దానాలు అమలు చేయటం లేదని ఆరోపించారు. పార్లమెంట్‌లో మెజారిటీ గల ఆయన వామపక్షాల ఎంపీలతో ప్రధాన మంత్రి ఇచ్చిన వాగ్దానాలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ రూ.213 కోట్లు జమ అయిందని దానికి వచ్చే వడ్డీలో కొంతైనా కార్మికులకు ఇస్తే నష్టం లేదని, అయినా ఇచ్చేందుకు ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. కార్మికులకు రూ.9వేలు పెన్షన్ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను మరోసారి ప్రధాన మంత్రికి తెలిపేందుకు ఈ నెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధాన మంత్రికి మెమొరాండం సమర్పించేందకు మహంతి ప్రతి పాదించగా అందుకు సమావేశం సమ్మతించింది. సమావేశంలో బసంత బెహర, ముధిరత్, దండపాణి పాత్రో, కేసీ పండా, రామ శంకర పట్నాయిక్, సర్వేశ్వర పండ, సుభాష్ బెహర, సరోజ్ పండ, జి.ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.