
ఊరూవాడా ఉప్పైనె కదులుతోంది..
గోదావరిఖని: ఎల్కతుర్తి శివారులో ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవసభకు ఊరూవాడా ఉప్పైనె కదులుతోందని ఆ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక ప్రె స్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండాను గుండెకు హత్తుకుందామని మహాసభకు ప్రజానీకం తరలివస్తోందని అన్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది సభకు తరలివెళ్లేలా 70 బస్సులు, పెద్దసంఖ్యలో కార్లు, ఆటోలు సమకూర్చామని ఆయన వెల్లడించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో బషీర్‌బాగ్ పోలీస్‌కాల్పుల్లో రైతుల మృతికి నిరసనగా ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 14 ఏళ్ల ఉద్యమంతో తెలంగాణ సాధించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానం వెనక్కి పోయిందని విమర్శించారు. తెలంగాణ గొంతుక కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నినదిస్తోందని ఆయన పేర్కొన్నారు. నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, గోపు అయిలయ్య యాదవ్, బోడ్డు రవీందర్, కుమ్మరి శ్రీనివాస్, కలవచర్ల కృష్ణవేణి, బొడ్డుపల్లి రవీందర్, జనగామ కవితాసరోజిని, తోట వేణు, చెలకలపెల్లి శ్రీనివాస్, అచ్చె వేణు, నూతి తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలిరండి
పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్