
బిల్లులు రాక.. నిర్మాణం పూర్తికాక
● ఇబ్బందుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ● తొలిదశలో రూ.లక్ష సాయం అందక చాలామంది పేదల ఆవేదన
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బేస్మెంట్‌స్థాయిలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ తొలిదశ బిల్లులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల మేరకు 600 చ.గ. విస్తీర్ణంలోపు నిర్మించుకుంటేనే బిల్లులు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని, ఆపై నిర్మించుకుంటే నిబంధనలు అంగీకరించవని మరోవైపు అధికారులు వివరిస్తున్నారు.
61 మందికి చెల్లింపు..
జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం తొలిదశలో రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఇలా జిల్లావ్యాప్తంగా 61 మందికి రూ.61లక్షలను హౌసింగ్ అధికారులు జమచేశారు.
తొలిదశలో మంజూరైన ఇళ్లు 1,940
జిల్లాలో తొలిదశలో 1,940 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ముగ్గు పోసినవి 671 ఉండగా, 149 బేస్మెంట్‌స్థాయికి చేరాయి. మరో 140 ఇళ్లు జీపీఎస్ సహకారంతో పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈ పరిశీలించారు. మిగతా ఇందిరమ్మ ఇళ్లు ప్రగతి దశలో ఉన్నాయి.
600 చ.గ. విస్తీర్ణం కన్నా ఎక్కువ ఉంటే..
తొలిదశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. 600 చ.గ. కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్నాయని, అందుకే బేస్మెంట్ స్థాయికి చేరినా బిల్లులు మంజూరు కావడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బేస్మెంట్‌స్థాయిలోని ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో సవరించుకునే అవకాశం ఉందని, ఈ విషయాన్ని లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలూ ఉన్నాయి.
ఎమ్మెల్యే దృష్టికి సమస్య..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. మంత్రి శ్రీధర్‌బాబు సూచనలతో స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
నిబంధనల మేరకు బిల్లుల చెల్లింపు
జిల్లాలో నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తాం. 400 చ.గ. – 600 చ.గ. విస్తీర్ణం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మించుకున్న 61 మందికి తొలిదశలో రూ.లక్ష చొప్పున బిల్లులు చెల్లించాం. మిగతా వారికి విచారణ జరిపాక బిల్లులు చెల్లిస్తాం.
– రాజేశ్వర్, హౌసింగ్ పీడీ, పెద్దపల్లి

బిల్లులు రాక.. నిర్మాణం పూర్తికాక