అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు | Buggana Rajendranath Fires On Chandrababu Over AP Debts | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు

Published Mon, Nov 18 2024 5:11 AM | Last Updated on Mon, Nov 18 2024 6:41 AM

Buggana Rajendranath Fires On Chandrababu Over AP Debts

బాధ్యతారాహిత్యంగా సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల తీరు 

బడ్జెట్, కాగ్‌ నివేదికలో అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని ప్రభుత్వం చెప్పింది 

అయినా చంద్రబాబు రూ.9.74 లక్షల కోట్లు అంటూ అబద్ధాలాడారు 

ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనట.. తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా? 

స్కీములన్నీ డీబీటీ ద్వారా అమలయ్యాయి.. ఇక స్కాములెక్కడ?

స్కాములన్నీ మీరే చేశారు.. తండ్రీ, కొడుకు నీకింత, నాకింతని పంచుకుంటున్నారు

సూపర్‌–6, సూపర్‌–7 పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులెక్కడ?  

మాజీ ఆర్థిక మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ‘బుగ్గన’ ఫైర్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థికమంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాగ్‌ పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా ఇదే  చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

అలాగే, పయ్యావుల చెప్పింది నిజమా? లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా లేదా టీడీపీ మాజీ ఆర్థికమంత్రి యనమల చెప్పింది నిజమా.. అనేది ఒకసారి ముగ్గురు ఒకచోట కూర్చుని ఒక అంకెకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనని ఆయనన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా.. ఇదేమైనా గండికోట రహస్యమా.. అని ప్రశి్నంచారు. ‘స్కాములన్నీ మీరే చేశారు. తండ్రీ కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు.. బడ్జెట్‌లో సూపర్‌–6, సూపర్‌–7 పథకాలకు కేటాయింపులు ఎక్కడ..’ అని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..   

స్కీములన్నింటికీ రికార్డులున్నాయి
వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యతలేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయా­లో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలుచేసింది. వీటన్నింటికీ రికార్డులున్నాయి. మరి స్కాము­లెక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్సులు, ఇసుక టెండర్లలో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకున్నారు. మైనింగ్‌ కాంట్రాక్టులు కూడా దోపిడీయే. ఏ స్కాములో చూసినా మీరే కనిపిస్తున్నారు. 

టీడీపీ ప్రభుత్వ బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది
గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.42,188 కోట్లు  బకాయిలు ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్‌ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉం­టుంది? వాటినీ పరిగణనలోకి తీసుకున్నా బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులుచేశాం. 

బాబు అప్పుల పెరుగుదల 22.63 శాతమైతే మాది 13.57 శాతమే
ఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22.63 శాతం కాగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అది 13.57 శాతమే. దీన్నిబట్టి చూస్తే ఎవరెక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది? అలాగే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రూ.16,400 కోట్లు అప్పులుచేసింది. ఈ అప్పును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు.. మూలధన వ్యయం సున్నా అని బాబు, సింగిల్‌ డిజిట్‌ అని యనమల చెప్పారు.. కానీ, మొన్నటి బడ్జెట్‌ డాక్యుమెంట్‌లోనే మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్‌ డిజిట్‌ ఎలా అవుతుందో చెప్పాలి.   

‘విద్యుత్‌’పై ఆరోపణల్లోనూ నిజంలేదు
విద్యుత్‌ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్లు నష్టంచేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజంలేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్‌ సంస్థల నష్టాలు రూ.6,625 కోట్లు ఉండగా చంద్రబాబు హయాంలో అవి రూ.28,715 కోట్లకు పెరిగాయి. అదే వైఎస్సార్‌సీపీ హయాంలో 2022–23 నాటికి అవి రూ.29,­110 కోట్లే. రూ.395 కోట్లే పెరిగింది.

ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్‌ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు... ఇప్పుడు 6 నెలల్లోనే రూ.6,072 కోట్లు విద్యుత్‌ చార్జీల భారం మోపారు. మరో రూ.12,000 కోట్లు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. తల­సరి ఆదాయం 2018–19 నాటికి రూ.1,54,­031లతో దేశంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. 2022–23 నాటికి రూ.2,19,881లతో 15వ స్థానానికి చేరింది.  

యనమల ఆరోపణలు విచిత్రం.. విడ్డూరం
ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల అయితే.. అప్పులపై చాలా అన్యాయంగా అవాస్తవాలు చెప్పారు. నిజానికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లే. ఇక వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్‌ అనేది అన్ని ప్రభుత్వాలు చేసేవే. వాటిని అవసరమైన రోజు­లు తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంవ­త్సరం ముగిసేనాటికి తీర్చే­­య­డం జరుగుతుంది. ఇలా తీర్చేసిన అప్పులను కూడా యనమల అప్పు­లుగా పేర్కొనడం.. విడ్డూ­రంగాను, విచిత్రంగాను ఉంది. అలాగే, ఆర్థిక విధ్వంసం, అరాచకం జరిగిందని ఆర్థికమంత్రి కేశవ్‌ అన్నారుగానీ, ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో  చూపించలేకపోయారు? చిక్కీలపై బకాయి పెట్టామన్నారు. మరి వాళ్లు కోడిగుడ్లపై బకాయి పెట్టలేదా? రన్నింగ్‌ బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజం.  

ఆదాయం తగ్గలేదు, పెరిగింది
ఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1999–­2004 మధ్య బాబు పెంచిన ఆదాయం 12.4 శాతమైతే.. 2004–2009 మధ్య వైఎస్సార్‌ 21.6 శాతం పెంచారు. తిరిగి 2014–19 మధ్య బాబు ఆరు శాతం పెంచితే 2019–­2024 మధ్య జగన్‌ 16% పెంచారు. సూపర్‌ సిక్స్‌లో పావు దీపం తప్ప మిగతా ఏవీ అమ­లు­చేయలేదు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబుతూ తప్పులుచేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రతీసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కారు. ఈ వయస్సులో అసెంబ్లీలో అవాస్తవాలు చెప్ప­డం చంద్రబాబుకు తగదు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement