
బీఆర్ఎస్ సభకు హాజరైన జనసందోహం. (ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న కేసీఆర్
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఫైర్
మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు
మమ్మల్ని మించిన సిపాయిలు లేరన్నారు..
కేసీఆర్‌ను మించి చేస్తామన్నారు
420 హామీలిచ్చి ఏమీ చేయకుండా ప్రజలను దగా చేశారు
ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే
రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం పడగొట్టం.. ప్రజలే వీపులు సాపు చేస్తారు
ప్రజలంతా ఓ నిర్ణయానికొచ్చారు.. ఓట్లెప్పుడొస్తాయా అని చూస్తున్నారు
కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు తాను బయటకు వస్తానని ప్రకటన
తెలంగాణ చెలరేగింది..మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టీకరణ
మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఇవాళ అప్పు పుడత లేదని మాట్లాడుతుండ్రు. నా మనసు కాలుతోంది. బాధ పడుతోంది.దుఃఖం వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె.. ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్‌మాల్ దింపుట్ల,అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు, ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నరు. ఓట్లెప్పుడు వస్తయా అని చూస్తున్నరు.
ఎల్కతుర్తి నుంచి సాక్షి ప్రతినిధి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా చేసుకుంటే, ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని, అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. మా అంత సిపాయిలు లేరు..కేసీఆర్‌కు మించి ఇస్తాం.. ఆరు చందమామలు తెచ్చి ఇస్తాం.. ఏడు సూర్యుళ్లు పెడతాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి ఏమీ చేయలేదని, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు.
రైతుబంధు లాంటి పథకాలు కావాలని తననెవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రజలే వీపులు సాపు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్ వన్ విలన్ అని అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఇక తాను బయటకు వస్తానని ప్రకటించారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.
బుక్కులు పంచిండ్రు.. బాండ్లు రాసిచ్చిండ్రు
హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరూరా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్నాయన జబ్బలు చరిచాడు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టారు.
మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాలు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎంత మంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన్రు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నరు. ఊ అంటే ఆ అంటే అబద్ధాలు చెబుతున్నారు. నమ్మి బోల్తా పడ్డం..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
అప్పుడెంత బాగుండె.. ఇప్పుడెట్లయింది?
‘ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు ఓ రైతు అలుకుతున్నడు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. పెద్ద మొగోడు అని ఒకర్ని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట. అట్లనే మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చి ఇస్తాం అన్నరు. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు.
ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందిని అడుగుతున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? ఎంత వరకు ఇది కరెక్ట్..? తెలంగాణను బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం.

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత బాగుండె. ఇప్పుడెట్లయింది? నా మనసు కాలుతుంది. బాధయితంది. దుఃఖం వస్తోంది. కేసీఆర్ పక్కన పోంగనే ఇంత ఆగమయితదా? ఎందుకు ప్రజల గోస పోసుకుంటున్నరు? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండె. కొనేటోళ్లు ఎక్కువుండె. అమ్మేటోళ్లు తక్కువుండే. నేను 24 గంటలు కరెంటు ఇయ్యలేదా? ఇప్పుడు ఎందుకు ఇయ్య శాతనయిత లేదు? మళ్లీ తెల్లందాక కరెంటు పెట్టడానికి పోవాల్నా..? మంచినీళ్లు కూడా ఇయ్య శాతనయితలేదు. కానీ మేం ఇంత సిపాయిలం, అంత సిపాయిలం అంటున్నరు..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఎన్నెన్ని చెప్పిరి.. ఏమన్నా చేసిన్రా?
‘కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె..ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్‌మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాం«దీలు, డూప్లికేట్ గాం«దీలు ఢిల్లీకెళ్లి దిగిరి. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేసిన్రు. కేసీఆర్ రైతుబంధు కింద ఏం ఇస్తుండు..రూ.10 వేలు ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తమని చెప్పిన్రు. పెన్షన్లు రూ.2 వేలు ఇస్తుండు మేం వస్తే రూ.4 వేలు ఇస్తమని చెప్పిరి.
ఇద్దరు ఉంటే కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమనిరి. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తుండు.. మేం రూ.6 వేలు ఇస్తమన్నరు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నరు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తమని చెప్పిరి. ఇక ఒకరెనుక ఒకరు ఉరికి.. రూ.2 లక్షల లోన్ తెచ్చుకోండి.. డిసెంబర్ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తం అన్నరు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చిన్రు. ఏమన్నా చేసిన్రా .. ఏం చేయలేదు. మాట్లాడితే బీఆర్‌ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు.
తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చారు
‘ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన.
2001 నుంచి గులాబీ పార్టీ పెట్టి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తమని నమ్మబలికిన్రు. మళ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన్రు. 14 సంవత్సరాలు ఏడిపించిన్రు. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన్రు. మళ్లీ వెనక్కి వెళ్లారు.
ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సుడి గాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన్రు..’ అని మాజీ సీఎం గుర్తు చేశారు.