
‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.
గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్ కావచ్చు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్యం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్‌ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.
చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.
త్రీస్టార్ హోటల్స్, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.
ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్‌సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.
ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.
గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.
ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.