బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా! | KSR Comments On CBN And Yellow Media In AP | Sakshi
Sakshi News home page

బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!

Published Fri, Jan 3 2025 11:05 AM | Last Updated on Fri, Jan 3 2025 11:36 AM

KSR Comments On CBN And Yellow Media In AP

ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్‌ జగన్‌ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్‌ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్‌ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్‌ జగన్‌ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్‌ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.




రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.

చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్‌లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్‌లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం 
నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.

ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. 
ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్‌ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.

రాష్ట్ర  ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం  ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.

మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్‌ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్‌-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement