
మాట్లాడుతున్న సుధాకర్‌బాబు. పక్కన కనకారావు
ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ సీఎం కావాల్సిందే
వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నేతల పిలుపు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.
కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్‌లో చోటు కలి్పంచిన ఘనత జగన్‌ది అన్నారు.
మాల, మాదిగలు కలిసే ఉన్నారు
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్ జగన్ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న అణగారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.
మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్‌కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు.
జనం మధ్య ఉందాం: సజ్జల
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు.